కరగని శిల.....శ్రీనివాస భారతి
కరగని శిల.....శ్రీనివాస భారతి


దారి పక్క ఉందో శిల
అందరూ వెళ్ళేవాళ్లే అటు
ఒక శిల్పి కళ్లబడింది అది
సుతారంగా సృశించాడు శిలను
దాన్నో అందమైన శిల్పంగా
రూపుదిద్దుకొనేలా ఊహిస్తూ
నిరంతరం ఒకే ధ్యాస
ఆ స్పర్శ మాధుర్య మహత్తేమో
శిల హృదయం ద్రవించింది
మెల్లగా కరుగుతోంది
శిల్పి చేతులు సుతారంగా
పైనుండి క్రిందికి తదేకంగా
అందమైన అపూర్వ రూపాన్ని
ఊహాల నుంచి వాస్తవానికి మారుస్తూ
ఉలి శిలపై లయబద్ధంగా నాట్యం చేస్తూ
శిల్ప శాస్త్ర సరిగమలు పలుకుతోంది మెల్లగా
పేరుకున్న అపోహ పొర నెమ్మదిగా కరిగి
ఉలి కనుకులంగా మారుతూ
శిల్పి చేతుల్లో అందంగా కదులుతోంది
జగన్మోహిని మెల్లగా ప్రాణం పోసుకొంటోంది
పాదాలు మంజీరాలై
పైపైకి పోతున్నాయి
వస్త్రాలు లతల్ని ప్రేమించి
అందంగా వచ్చి కూర్చున్నాయి
జఘన భారంతో నడుం
వంపులు తిరిగింది శిల్పంలో
రోజులు గడుస్తున్నాయి
రూపం మారుతోంది మెల్లగా
నాభి ప్రపంచాన్ని జయించింది
శిల్పి స్పర్శా సుఖంలో
సుందరంగా మెలిదిరుగుతొంది శిల
ఆలోచనలు శిల్పికి
పైభాగాన్ని ఎలా మలచాలోనని
నాట్య భంగిమా
అజంతా శిల్పమా
అజారామరంగా చెక్కాలను కొని
ఆలోచనలో పడిపోయాడు
అన్నీ
కలగాపులగం ఊహలు...
పద్మినీ జాతి స్త్రీని
అపూర్వంగా తీర్చే క్రియలో
శిల్పి
మౌనాన్ని ఆశ్రయించాడు
శిల సగమే కరిగింది
పై సగం ఇంకా
పూర్తి రూపం పోసుకోలేదు
శిల్పి పిచ్చివాడై
దేశాలు పట్టి పోతే
శిల తన పొరపాటును
ఇంకా ఆలోచిస్తోంది
ఎప్పటికి తనకి పూర్తి రూపు వస్తుందోనని
◆◆◆◆◆◆◆©©©©©©©©©©©◆◆◆◆◆◆◆◆