కోరిక తీరిన వేళ
కోరిక తీరిన వేళ


నీపై నాప్రేమ చినుకులా మొదలై
మేఘాల నుండి జారిన వర్షపు ధారలై
పుడమిని తాకిన నదిలా పొంగి వరదలై
నీమదిని చేరె, కడలిని కలిసిన నదియై
ఎద నిండిన నీ తీయటి తలపులని
గుండె గూటిలో పదిల పరచుకొని
మదినిండా భావాలను ప్రోది చేసుకొని
ఆశతో నీరాకకై నేనిట వేచియుంటిని
నీ రాకతో నామది పరవశించి పోయె
నీపిలుపు విని తనువు కంపించి పోయె
నీఎదుటకు రావాలన్న కలవరమాయె
నీఎదుట పడగానె కన్నులు వాలిపోయె
ప్రేమ నిండిన చూపుల నను కాంచినంతనే
తనువంత సిగ్గుతో ముకుళించి పోయెనే
ననుపట్టి నీకౌగిట బంధించి నంతనే
లోలోన ఆనందము పొంగి పొరలెనే
మృదు మధుర మాటలతో జయించె
నాలోని బిడియమును తొలగించె
నన్ను తన వశురాలిని గావించె
నా మదికి సంతసము నందించె
ఆతని రాకతో చీకటి వెలుతురాయె
కలలన్నీ ముంగిట సాకార మాయె
మది నిండిన ఆశలు వెల్లువై పోయె
నాజీవన గమనమే మారి పోయె