కొండవాగు
కొండవాగు
కొండవాగు నా కవితాధార
ఎండి పోదు ఈ ఆర్ద్రత ఏ వేళా
హృదయ గిరులందు పుట్టి
ప్రవాహమై పరుగులిడుచు
గంతులేయుచు కిందికి దూకు
జలపాతముగ మారి
అడవులలో అందముల మధ్య అందమై
కదలుచు కదిలించు తీయని నీటి జాలు
నాగరికులెవ్వరికి కనబడని జల గమనము
గిరిజనుల మనము వలె కుళ్ళు లేని నిర్మలము
వాదముల సంస్కృతుల సిద్ధాంతముల ఉనికి తెలియని (క)
తనకై తాను సాగే సామాజిక స్పృహ లేని వట్టి నీటి పరుగు
ఎఱుగదది పద గమన నిర్దేశనలు
ఉన్నట్టే తెలియదు దానికి నడకల సూత్రములు
అలంకారములు ఆర్భాటములు పట్టని తాను
కొండల కోనల స్వేచ్ఛగా విహరించే చెంచీత
రాలపై ఉదాత్తనుదా
త్తముల వేగముగ చలించుచూ
శ్రావ్య రాగముల గానము చేయు కోయిల
ఎత్తుల పల్లముల ఇష్టమున గంతులేయుచు
నటనలు నేర్వకనే నర్తించే మయూరి
చిత్ర కారుల కుంచెలంచులు
దిద్దలేవు దాని ఒద్దికలు
ఛందస్సున కనుగుణముగ కదలు
గురు లఘువులు పట్టలేవా పరుగులు
ఆనవు వాద ప్రతివాద సంకులి(చి)త మానస దృష్టికి
దాని తీరు తెన్నులు సహజ గమన సౌందర్యములు
తావమాడరెవరూ గ్రోలరా నీటి నే దొరలూ
దాని ఉనికే తెలియదు
పురవాసులైన వేత్తలకు
నిర్మల మానస ప్రవాహము నా కవిత
దివ్య హృత్ ధ్యాన గమనము దాని నడత
ఆంద్ర సాహితీ గోదావరీ సలిలముల
మౌనముగ కలియుచు
తనదనము కోల్పోని కిన్నెరసాని!
నా కైతల కొండవాగు!