చదువుకున్న శ్రమ జీవి ప్రశ్నలు
చదువుకున్న శ్రమ జీవి ప్రశ్నలు


జర్మన్ మూలం: బెర్టోల్ట్ బ్రెఖెత్
తెనుగు సేత: డా. వారణాసి రామబ్రహ్మం
ఏడంతస్తుల థేబెన్ భవనాన్ని ఎవరు నిర్మించారు?
చరిత్ర పుస్తకాలలో చక్రవర్తుల పేర్లు ఉంటాయి:
ఆ చక్రవర్తులు రాళ్ళను ఎత్తి మోశారా?
ఎన్నో సార్లు బాబిలోనియా ధ్వంసం చేయబడింది
అన్ని సార్లు దానిని ఎవరు పునర్నిర్మించారు?
బంగారు కాంతితో మెరసి పోయే లిమా నగరంలో
పని వారు ఎటువంటి ఇళ్ళలో నివసించేవారు?
చైనాలో గోడ కట్టడం పూర్తైన సాయంకాలం
దానిని నిర్మించిన తాపీ వాళ్ళు ఎటు వెళ్లారు?
రోమ్ నగరం నిండా విజయ వలయాలు
వాటిని ఎవరు ఎత్తారు?
సీజర్ ఎవరిని జయించాడు?
యువ అలెగ్జాండరు భారత దేశాన్నిగెలిచాడు
అతనొక్కడే గెలవగలిగాడా?
స్పెయిన్ ప్రభువు ఫిలిప్
తన నౌకలు మునిగిపోయినప్పుడు ఏడ్చాడు
ఇంకెవరూ ఏడవలేదా?
రెండవ ఫ్రెడరిక్ ఏడు సంవత్సరాల యుద్ధం నెగ్గాడు
ఆటను తప్ప ఇంకెవరు నెగ్గారు?
ప్రతి పేజీకి ఒక విజయం
విజయాల విందులు వండినదెవరు?
ప్రతి పది సంవత్సరాలకు ఒక గొప్ప వ్యక్తి
ఎవరు భరించారు ఇన్ని ఖర్చులు?
ఎన్ని చరిత్రలొ
అన్ని ప్రశ్నలు
బెర్టోల్ట్ బ్రెఖెత్ ఈ కవితని 1937 ప్రాంతం లో రాశాడు.
శ్రీ శ్రీ 1950 ల లో రాసిన
"తాజ్ మహల్ నిర్మాణానికి రాళ్లెత్తిన కూలీలెవరు?
అనే కవితా ప్రయోగం పై
బెర్టోల్ట్ బ్రెఖెత్ యొక్క ఈ కవితా ప్రభావాన్ని
విమర్శకులు ఉటంకిస్తూంటారు