కంటి చూపులో ప్రేమ కవిత
కంటి చూపులో ప్రేమ కవిత
సూర్యుడు నా అందాలని చూడాలని
ప్రతి ఉదయం ఉదయిస్తున్నాడు
తన లేత కిరణాలతో నా నుదురును ముద్దాడుతాడు
రాత్రి తారలు కుసుమాలుగా నా సిగలో చేరుతాయి
నీలి సముద్రపు తెరలు చీరలాగా చుట్టుకొమ్మని
తెల్లటి మేఘాలు, తోటలోని పూలు
నా రైకలో రంగులద్దు కొమ్మని మారం చేస్తున్నాయి
నా అందం ముందు రేరాజు వెల వెల పోతు
మబ్బుల చాటు దాక్కుని ఓరకంట చూస్తూ
మురసిపోతు చుక్కల్ని వదిలేసి భూమికి వచ్చాడు
నీతో యుద్ధం చేసి నన్ను నింగికి తీసుకెళ్లడానికి...
నీ విచ్చుకున్న పెదాల మాటున విరబూసిన
చిరునవ్వులతో నాకు వలపు వలవేసావు
నీ స్పర్శతో నా తనువుకి గాలం వేసి లాగావు
నీ శ్వాసతో నా మెడ ఒంపులను, ఎద పొంగులను సుగంధ నిట్టూర్పులతో గిలిగింతలు పెట్టావు
ఎంతో మంది నా హృదయాన్ని తాకాలని చూసారు
కానీ నీ చూపుల్లో కత్తులు దాచుకున్నావు కాబోలు
నా యదకు గుచ్చి తీయ్యని గాయాన్ని చేసి
నా గుండెల్లోకి నీవు మాత్రమే చొచ్చుకొని వెళ్లావు
నీ పైన నాకు ఇష్టాన్ని, ప్రేమను పొంగిపొర్లించావు
నా వలపుల మలపులను, పల్లపు నునుపులను
ఊరిస్తున్న ఎత్తులను, మెత్తని లోతులను,
ఉడికిస్తున్న దోర పెదవులను,
సొట్టబుగ్గల నవ్వులను
కవ్విస్తున్న నడుము వంపులను,
నీ వాడి చూపులతో
నాలో దాగున్న రహస్యాల సర్వాంగ సొగసులకు
గాట్లు పెడుతూ నాకు విరహాన్ని పుట్టిస్తున్నావు
కావాలంటే నా కంటి కవరు పేజిని తెరిచి చూడు
నీ మీదా నేను రాసిన ప్రేమ కవితలు ఉంటాయి
ఒక్కో పేజీని చదివి చూడు,
ఆపివేయడం నీ తరం కాదు
నిన్ను ఆకట్టుకొని బాహ్యప్రపంచాన్ని
మరిపించి మురిపీస్తాను
నీ బహువుల బిగి కౌగిలిలో నేను ఖైదినవుతా
ఈ ముద్దుగుమ్మను ఏ కనికట్టు చేసావో కానీ
ఉహాళ్లలో నీకు బానిసను అయ్యాను
ఈ చర నుండి నన్ను నీ చేతుల్లోకి తీసుకో
నీ దానిని చేసుకో, ఈ జన్మకు నన్ను ఎలుకో!

