కళ్ళు
కళ్ళు
భూతద్దం ఎరుగలేని
డేగ కళ్ళు
ఆకర్షించే పిల్లి కళ్ళు
కళ్ళు తెరిచే నిదురించే
చేప కళ్ళు
పెద్దఏనుగే కానీ
ఎంతో చిన్న కళ్ళు
బాధల నమూనాలే
చెమరిన కళ్ళు
నేత్రదానానికి ఆధ్యమైన
భక్తకన్నప్ప కళ్ళు
చరిత మరువని
గాంధారి గంతల కళ్ళు
న్యాయాన్ని కబోదిగా మార్చిన
న్యాయదేవత కళ్ళు
ముక్తేశ్వరునికి మూడుకళ్ళు
నయనాల్లో నయాగరా
జలపాతాలుంటాయి
కన్నీటిని నింపి
కష్టాల్ని చెబుతాయి
ఎర్రగా చేసి
కోపంగా మాట్లాడుతాయి
కనురెప్పలు వాల్చి
క్షమాపణ కోరుతాయి
రెప్పల మాటున
కలలను దాస్తాయి
నల్ల కళ్ళే
తీక్షణ వీక్షణాలతో
దిష్టి పెడతాయి
కాటుక దిద్దితే
అందానికి మెరుగులవుతాయి
హావభావాలెన్నో పలికిస్తాయి
దృష్టి కారకాలు
కవలల్లా జన్మిస్తాయి
కలకాలం తోడుంటాయి
సేద తీరి
నిదురిస్తాయి
చచ్చినా బ్రతికుంటాయి
ఏ భేధభావం లేకుండా
మరోకరికి బ్రతుకునిస్తాయి
