కడుపు తీపి
కడుపు తీపి
ఈ సృష్టిలో కడుపు తీపి మాత్రం అమ్మది
ఏ కాకి పిల్ల ఆ కాకికి ముద్దు ఒక సామెతది
నవమాసాలు మోసిన అమ్మకే అన్నీ తెలుసు
రక్త మాంసాలు పంచి, పెంచిన అమ్మే తెలుపు
రెండు గుండెల చప్పుడుకు ఒకటే ప్రాణం
ఒకదానికొకటి వినిపించే ఆ మధుర క్షణం
తల్లి బిడ్డలకు సృష్టిలో కడుపు తీపి ఆయువు
కడుపు తీపి కాస్త మారేటి ప్రాణ వాయువు
పేగుబంధంతో పెనవేసుకున్న కడుపు తీపి
కలల పంటలో మొలకెత్తిన నలుసొక తీపి
పురిటి నొప్పిని దిగమింగిన ఆ కన్న తల్లి
బతుకంతా కడుపు తీపితో నిత్యం తల్లడిల్లి
రక్తధారల్లో కలిసిన ముద్దు తీపి బంధాలు
వంశాంకురాల్లో మొలకెత్తేటి కొత్త ప్రాణాలు
తల్లి పురిటి నొప్పిని నవ్వుగా మార్చే మాయలు
కొత్త ప్రపంచాన్ని చూసేది ఆ బిడ్డ ఛాయలు
కన్న బిడ్డకు కష్టమొస్తే కన్నీటి పర్యంతం
కంటికి రెప్పలా కాపాడుకొను ఆద్యంతం
ఈగ వాలితే తట్టుకోలేని ఆ తల్లి ప్రాణం
సుఖ సంతోషాలతో ఉండాలనే తాపత్రయం
కడుపు తీపంటే నవ మాసాల మౌన సంభాషణ
ఆ తీపితో ప్రతి తన్ను, కదలికలో ఒక వీక్షణ
అమ్మ ప్రతి శ్వాసలో జాగ్రత్త, ప్రతి క్షణం త్యాగం
కడుపు తీపికై ఆరాటపడే అమ్మ జన్మ ధన్యం
ఆకలి, అర్ధాకలితో తన పిల్లల కడుపు నింపేది
కానరాని లోకాలకు వెళ్లినా ఆమె మరువలేనిది
ఎత్తుపల్లాలు ఎన్నున్నా కడవరకు కడుపు తీపి
ఏ జీవి ఎద కోసినా మదినిండా నిండిన ప్రీతి
కడుపు తీపిలో కారుణ్యం, కనికరం, ప్రేమ
సంతతి ఏదైనా వారి పట్ల దయ, జాలి, కరుణ
పెంపకంలో పెనవేసుకున్న కడుపు తీపి వరం
ఆ అమ్మ త్యాగాలు ఆస్వాదిస్తూ పిల్లల తరం
అమ్మ కడుపు తీపి మాటల్లో చెప్పలేనిది
అనాదిగా ఏ కాలం కూడా చెరిపివేయలేనిది
జన్మ జన్మలు మారినా మారనిది ఈ తీపి
ప్రతి తల్లి గుండెల్లో గూడుకట్టుకునే నీతి, ఖ్యాతి!
