జ్ఞాపకం
జ్ఞాపకం
జ్ఞాపకం
ఎన్నో జ్ఞాపకాల లతలు ఒక్కసారిగా నన్నల్లుకున్నాయి
అహపు పొరల మధ్య బంధం ఇరుకున పడినా
ప్రయత్నించిన ప్రతీసారి నన్ను వెలివేశావు.
ఆత్మాభిమానాన్ని చంపుకొని చేయిచాచినప్పుడు గిరిగీసుకునికూర్చున్నావు.
ఎన్ని మాటలపూదోటలు
ఎన్ని వెన్నెల కాంతులు
ఇంకెన్ని విరహబాధలు
అన్నీ ఈనాడు జ్ఞాపకాలయినాయి.
మరి నీఊహలో నేనున్నానో లేదో
నీ ఉనికి కూడా కనిపించకూడదనుకున్నావో.
నా దగ్గరకు వచ్చి ఆగినా పలుకరించలేదు.
నా కళ్లలో కి చూసే ధైర్యం కూడా లేదా?
నేనూ నా మెట్టెలవంకచూస్తూ
నీ పాదాలనే గమనిస్తున్నాను
ఒక్కో అడుగూ నీవు వేసుకుంటూ పోతే
నా గుండెలమీదనుంచే పోతున్నట్టనిపించింది.
అప్పుడూ ఇప్పుడూ కన్నీళ్లే మిగిల్చావు.
నా మనసు నీ పాదాల వెంటే పరుగెత్తింది.
నీదంటూ మిగిలిన జ్ఞాపకం ఒక్కటీ లేదు.
నిను చూద్దామని చూసానా నా కంటిలో నీళ్లకు మసక పడి నిను చూడనూలేదు.
కొన్నిబంధాలంతే.
ముడివేసుకుంటేనే ముత్యాలహారంలా మెడనంటుకుంటాయి.
ఒకసారి విడివడితే
చేతికందకుండాపోతాయి.
నాకన్నీళ్లకి రాయి అయిన మనసు
మరల తడినిచేర్చుకుంది.
జ్ఞాపకాన్ని కడిగి గడపను చేరిన నా మనసు శ్రీగంధమై పరీమళిస్తుంది.

