జీవన తరంగాలు
జీవన తరంగాలు
అలుపెరగని అంతరంగాలే
ఈ జీవనతరంగాలు -
ఈ అనంత సాగరంలో సుడిగుండాలను,
అంతుబట్టని సునామీలను దాటి
ముందుకు సాగటమే జీవితం
ఈ జీవిత చదరంగంలో నేర్చుకోని
పాఠాలు యమపాశాలై గుణపాఠాలుగా
గుచ్చుతుంటాయి ;వెంటాడి వేటాడి
మరీ బోధిస్తుంటాయి ;
ఏది ఏమైనా ప్రయాణం ఆగదుగా,
ఈ గొలుసు కధ తప్పదుగా!
అనేక అనేక కధల మిళితమే
కదా ఎందరికో జీవనతరంగాలు
మనిషి జీవితచదరంగంలొ ఎత్తు పల్లాలు,
వ్యధల తాకిడి ఎంత ఉన్నా; ఆ సముద్రపు హోరులో,
అలల తాకిడిలో ఎదురీది ముందుకు
పోవడం తప్ప మరేది గత్యంతరం!
గత చరితను తలుచుకుంటూ వర్తమానాన్ని
నిర్దేశిస్తూ అగోచరమైన రేపటి గమ్యానికి
ఎగిసే అలలా సాగిపోవాల్సిందే
