మిడిసిపాటు
మిడిసిపాటు
కండువాకు ఉందెక్కడ..నీకెందుకు మిడిసిపాటు..!?
ఏ కుర్చీ ఎన్నాళ్ళట..తోడెందుకు మిడిసిపాటు..!?
పాత్రోచిత ధర్మమెవరు..నేర్పగలరు ఎవరికైన..
ఎగిరిపడే అలకుందా..ఎదకెందుకు మిడిసిపాటు..!?
దేనినైన వదిలించే..నిప్పున్నది తలపుమాటు..
జీవితమే నాటకమే..అసలెందుకు మిడిసిపాటు..!?
చినుకుతేనె లూరించే..పూలగాలి ఏమనునోయ్..
ఏ చెట్టున పండేనట..ఇకనెందుకు మిడిసిపాటు..!?
ఏ మేఘం ధరించింది..అహంకార కిరీటాన్ని..
ఏ కిరణపు నేస్తమంట..జట్టెందుకు మిడిసిపాటు..!?
ఎవరు నీవు ఎవరు నేను..సాక్షిలాగ మిగిలిరెవరు..
విర్రవీగు మనసదేల..బరువెందుకు మిడిసిపాటు..!?
