బాల్యం
బాల్యం
అప్పుడప్పుడు మనసు బలంగా ఊగిసలాడుతుంది..
వీలైతే కాలప్రవాహంలో వెనక్కి వెళ్లి,
ఆ పాత రోజుల్లోకి గట్టిగా పరుగెత్తాలనిపిస్తుంది!
ఎండాకాలమంటే కేవలం
ఈత కొట్టడానికే మాత్రమేనని
నమ్మిన ఆ అమాయక బాల్యాన్ని,
మళ్లీ అంతే బలంగా నమ్మాలని ఉంది!
బాలమ్మపెద్దమ్మ వేపచెట్టు నీడన
దోస్తులతో కలిసి ఆడిన పిక్కెలాట,
గోలీలాటల్లో గెలవాలని ఆశగా ఉంది!
పెద్దలు అల్లుతున్న మోకులు, పేనుతున్న పగ్గాల ఒడుపును
నేర్పుగా ఎందుకు ఒంటబట్టించుకోలేదో
అర్థం చేసుకోవాలని ఉంది!
సాయంత్రంపూట తాతలంతా కూడి
వ్యవసాయం, రైతు ముచ్చట్లు చెప్పుకుంటుంటే,
ఆ నాణ్యమైన బతుకు పాఠాలను
మనసున నింపుకోలేకపోయిన కారణమేంటో
తెలుసుకోవాలని ఉంది!
రాత్రైతే చాలు, సంతోషంగా
ఆడమగ తేడా లేకుండా ఆడుకునే
కోలాటం ఆటలు, పాటలు
ఏర్చికూర్చి నేర్చుకుంటే ఇంకెంత ఆనందంగా ఉండేదో
తెలుసుకోవాలని ఉంది!
పెరట్లో వేసిన బ్యాడ్మింటన్, కబడ్డీ కోర్టుల్లో
ఆనాటి కుర్రతనాన్ని, ఉడుకు రక్తాన్ని
మళ్లీ రుచిచూడాలని ఉంది!
వీడియో సినిమాలోని డైలాగులను
మరోసారి అభినయించి వల్లించాలని ఉంది!
కాలం వెనక్కి నడిపించే పడవెక్కిస్తే,
పొంతకుండ ముందు కూర్చున్న అమ్మ కన్నీటి తడి
ఎందుకు ఆరేది కాదో తెలుసుకోవాలని ఉంది!
అన్నింటికీ ఆరాటపడే నాయన ఆత్రానికి,
ఆయన కోపానికి భయపడకుండా
ధైర్యంగా, నెమ్మదిగా సమాధానం చెప్పాలని ఉంది!
వారి జీవిత సత్యాలను మరింత బలంగా
అనుభవంగా మార్చుకోవాలని ఉంది.
కానీ..
జారిన కాలం తిరిగి వస్తుందా?
ఆ బాల్యం మళ్లీ నడచి వస్తుందా..?
