వాగ్ధానం
వాగ్ధానం
మనిషి వాగ్దానం అంటే కాకూడదు వట్టి మాట
గట్టి మాటతో మనిషిని నడిపించే ఓ బాట
అలాగే పెదవులపై పుట్టే వరాల సఖ్యత
మన మనసు మీద ముద్రించే బెట్టైన బాధ్యత
నిత్యం ఎన్నికల వేళలో నాయకుల మాటలు
గడప గడపకు వినిపించే హామీల మూటలు
వారి వాగ్దానాలు నిజంగా నీటి మీద రాతలు
ఈవీయం మూయగానే గాల్లో కలిసే కోతలు
వాగ్దానమంటే మనిషిపై నమ్మకానికి నాంది
కానీ మోసాల ముసుగులతో విసుగు చెంది
మాట్లాడే మాట తప్పొద్దు, మడమ తిప్పొద్దు
ఇచ్చే హామీల సునామీలు ప్రజలను ముంచొద్దు
ఒకరికొకరు నమ్మిన మాటలకై ఎదురు చూపు
స్నేహితుడి మాటల్లో గుండె నిండా పిలుపు
ఒక వంచనతో ఒరిగేది నమ్మక ద్రోహ ముద్ర
మనిషికి కావాలి విశ్వాసాలతో నమ్మిన నిద్ర
నేటి కాలంలో పరస్పర సహాయానికి వేటలు
క్షణాల్లో పుట్టి, క్షణాల్లో పెరిగి, తరిగే మాటలు
వాగ్దానాల వరదలో నిజాయితీ ఓ నీటి చుక్క
ఎడారిలో ఎంత వెదికినా దొరకదనేది పక్కా
వాగ్దానం అంటే మెప్పుకై విసిరే మాట కాదు
నిజాయితీతో నెరవేర్చే సంకల్పంపు పాదు
మాట ఇచ్చే ముందు వందసార్లు ఆలోచించు
ఇచ్చాక ఎంత కష్టమైనా నిలబెట్టి సాధించు
ఎందుకంటే ధనం పోతే సంపాదించవచ్చు
అధికారం పోతే తిరిగి మళ్ళీ పొందవచ్చు
కానీ వాగ్దానం విరిగితే విశ్వాసం గొడ్డలి పెట్టు
నిజంగా ఆలోచించి ఇచ్చిన మాట నిలబెట్టు
అందుకే మాటలపై మనిషి నిలబడాలి
పలికే పలుకుల్లో మానవత్వం నిలువాలి
వాగ్దానం నెరవేరినప్పుడే మాటకు విలువ
సమాజంలో నలుగురి బతుకుల్లో చలువ
