జీవిత కథ
జీవిత కథ
తల ఎత్తలేని గడ్డి
పాదాల కింద నుంచే
ఆకాశాన్ని పిలుస్తోంది
పిట్ట కూత
ఉదయపు నిశ్శబ్దాన్ని
రెండుగా చీలుస్తోంది
చెట్టు కొమ్మపై కూర్చున్న కాలం
ఆకుల మధ్యనుండి
నెమ్మదిగా జారిపోతోంది
పిట్టగోడ మీద కూర్చున్న సాయంత్రం
సూర్యుడి చివరి ఊపిరిని
చేతులతో పట్టుకుంటోంది
చెమట కళ్లతో రైతు
మట్టిలోకి వంగి
రేపటిని నాటుతున్నాడు
కూలిన గుడిసెలో
చీకటి ఇంకా వెలుగు కోసం
ఎదురు చూస్తోంది
నడుస్తున్న దారి
గమ్యంకంటే
పయనాన్నే ఎక్కువ ఇష్టపడుతోంది
నదిలో పడిన చందమామ
తన ముఖాన్ని తానే పోల్చుకోలేక
వెతుక్కుంటోంది
జీవితం
తన కథని తానే
అక్షరాలుగా ఒలికిస్తోంది
