గురువు
గురువు
బ్రతుకుబాట మెఱుపుపంట..మూలమతడె గురువు..!
అక్షరాల సూర్యుడైన..మిత్రుడతడే గురువు..!
మోసికన్న అమ్మకన్న..ఆత్మీయులు ఎవరొ..
అమ్మలోని ప్రేమరూప..దైవమతడె గురువు..!
పొత్తిలింట హత్తుకున్న..తల్లి శ్వాస లోన..
తండ్రిహృదయ మౌనహాస..చంద్రమతడె గురువు..!
నీ ప్రతిభయె వెలుగులీన..సహకరించు వాడు..
నిత్యతపో మగ్నుడైన..బ్రహ్మమతడె గురువు..!
నిచ్చెనల్లె తానుండే..నిర్మలాత్ముడేను..
నీ ప్రగతిని ఆశించే..విష్ణువతడె గురువు..!
నీలోపల తననుతాను..దర్శించే నిధియె..
చూపుచేత బోధించే..బుద్ధుడతడె గురువు..!
