గుండె గూటిలో
గుండె గూటిలో
గుండెపైన మంచుపూలు రాలుతున్న సడి ఎక్కడ
నిన్నలలో ప్రవహించిన ప్రేమావళి నది ఎక్కడ
పొడిబారిన కనులలోన ఉప్పునీటి మడి ఎక్కడ
ఎరుపెక్కిన పాపలలో ప్రమోదాల జడి ఎక్కడ
కురుల నలుపు దోచాలని
నీ పైనే తిరుగుతాయి
ప్రేమలేఖలను మోసే కరిమబ్బుల గుమి ఎక్కడ
సీతాదేవిని వదలిన రాముడిలా ఉండలేను
అంతఃపురమంతటినీ పాలించిన సఖి ఎక్కడ
నా పూజలు వద్దనుకుని ఎటు వెళ్ళావో తెలియదు
నీవులేని గుండెలోని మాయమైన గుడి ఎక్కడ
అణువణువున పసిడిపూలతోటలెన్ని పెంచావో
విహరించాలని చూసే చూపులలో వడి ఎక్కడ
హేమంతంలో కూడా వణుకన్నది తెలియలేదు
విఫలమైన ప్రేమ మంట పెడుతుంటే చలి ఎక్కడ
సరసమైన కావ్యాలను చదవలేదు "నెలరాజా"
వలపించే కవిత్వాన్ని
నేర్పుతున్న బడి ఎక్కడ.

