గుండె గులాబి
గుండె గులాబి
స్వప్న సౌధం కూలుతుంటే దేవులాడక మేలుకోనువు...
గుండెసంద్రం పొంగుతుంటే కనులలోనే దాచుకోనువు..
గుండెగులాబి విసిరి కొట్టిన చెలియవెనుకే
తిరుగుటెందుకు
కలతమేఘం కమ్ముతుంటే గమ్యమేదో చేరుకోనువు
వలపు వెన్నెల చెలియ చూపున ఎంత వెతకిన దొరకదాయే..
వింతమోహం కమ్ముతుంటే మనసు దిటవుగ చేసుకోనువు..
చిన్న నవ్వుకె ఊహలెన్నో అల్లుకున్నా పిచ్చివాడివి
ప్రేమకన్నా గొప్పవైనవి కలవు ఎన్నో తెలుసుకో నువు
బ్రతుకునంతా మోడు చేస్తూ వెళ్లిపోయెను ప్రేమదేవత ..
వసంతాన్నే కోరుతుంటే శిశిరబాధను తట్టుకో నువు
మోసపోతివి వెర్రి ప్రేమన తెలియలేదే చివరి వరకూ..
మజిలి మజిలీ నేర్పుతున్నది కొత్తపాఠం నేర్చుకో నువు
అగ్నిగుండం చేసుకోకోయ్ గతం చెరలో మగ్గిపోతూ
సుజాతమైన భవిత కోసం కొత్త ఒరవడి దిద్దుకోనువు

