గేయాన్నె మళ్ళీ మొలకెత్తాలని
గేయాన్నె మళ్ళీ మొలకెత్తాలని
మది గాయపడినా గేయమే!
హృది పాడుకున్నా గేయమే!
మనసు పల్లకీలో ఉరేగినా గేయమే!
చండ్ర నిప్పుల నడకలో గేయమే!
మనసు ఎండమావిలో అలసిపోయినా గేయమే!
మల్లెల గాలి చల్లగా సోకినా గేయమే!
నా చేతి కలం
అక్షర లక్షలు పలికే వెలుగుల కాగడా!
నా చేతి సిరాతో తడిచే
తెల్లకాగితమొక బావుటా!
కేతనమల్లే రెపరెపలాడినా...
గాలిపటమల్లే స్వేచ్ఛను శ్వాసించి బ్రతికినా...
అది నా గేయమే!
నేను బ్రతికినంతకాలం
ప్రతి సూర్యోదయం గేయమై నిదురలేస్తుంది!
అస్తమయం నన్నాక్రమించినవేళ
మరణం లేని నా గేయం నన్ను
ప్రతి ఉదయం మీకు గుర్తు చేస్తుంది!
కోరుకునేది ఒకటే... మరుభూమి మట్టిలో
గేయాన్నై మళ్ళీ మొలకెత్తాలని!

