ఎవ్వరికో
ఎవ్వరికో
చూపుటెలా ఎవ్వరికో..నీ ధ్యాసయె మధువైనది..!
జరగలేను ఏ ప్రక్కకు..నీ ఎఱుకయె గొడుగైనది..!
నీడపడక బ్రతుకుతీరు..నేర్పినావు నేర్పకనే..
తిరుగలేను ఎచటెచటో..నీ భాషయె వనమైనది..!
అవసరాలు ఉండునెలా..నిద్దురయే రాలిపడగ..
అడుగలేను పెదవివిప్పి..నీ స్మరణయె ఎదురైనది..!
శ్వాస భలే ఆగిపోయె..ఇంతకన్న అద్భుతమా..
చెప్పలేను అనుభూతిని..నీ గాథయె తోడైనది..!
అక్షరాల సెలయేఱుగ..జీవించే విధమేదో..
వినగలేను మరియేదో..నీ పాటయె వెలుగైనది..!
ఈ వీణను శృతిచేసే..చేతులేవొ కానరావె..
నిలువలేను వేరెచటో..నీ పూజయె నేనైనది..!
