ఎలా ఎలా
ఎలా ఎలా
మనిషై పుట్టీ చూపులగుడిలో..చేరకపోతే ఎలాఎలా..!?
జన్మల గట్టును పట్టగ ధ్యాసను..పెట్టకపోతే ఎలాఎలా..!?
మతాలు కులాలు పట్టుకు కొట్టుకు..చావడమేనా ఒరేఒరే..
గురుకుల చదువుల బోధలు మతికే..ఎక్కకపోతే ఎలాఎలా..!?
పాలకులెవరో పాలితులెవరో..నాటకమందున పాత్రలొరే..
సమభావనమే చెలిమిసూత్రమది..వెలగకపోతే ఎలాఎలా..!?
కత్తులు బాంబులు బాణాలేవో..తెచ్చెను శాంతిని ఎప్పుడటా..
అజ్ఞానాహంకారములేవో..పేల్చకపోతే ఎలాఎలా..!?
కమ్మని తియ్యని రుచులకు బానిస నాలుక నీమనసే..
కాస్త వివేకమను ఖడ్గపు రుచినే..చూడకపోతే ఎలాఎలా..!?
బంగరు మౌనపు వెన్నెల దీపం..ఉన్నది హృదయపు కోవెలలో..
చూడగ చేరగ నిధిగా సహనం..ఉండకపోతే ఎలాఎలా..!?
