ఏవి చదువులు
ఏవి చదువులు
అంశం :చదువులు
శీర్షిక : ఏవి చదువులు
రచన : శరకణం కనకదుర్గ
****************
ఝుమ్మని సంగీతం వినిపిస్తూ బతుకుబాటలో సాగిపోయే తుమ్మెదకు
తేనె పూలను పసిగట్టమని ప్రతి పూవుని శోధించి సాధించమని నేర్పినది
ఏ చదువులు..
ప్రధానోపాధ్యాయుడు లేకున్నా
క్రమశిక్షణతో మెలుగుతూ నడిచే
ఎర్ర చీమలు నేర్చినది
ఏ చదువులు...
తన సామర్థ్యాన్ని కన్నా యాభై రెట్ల బరువున్న ఆహారాన్ని బంతిగా మలిచి దొర్లించుకుపోయే గండు చీమలు నేర్చింది
ఏ చదువులు..
కనుసైగలూ లేవు
మూగ భాషలూ లేవు
ఉత్తర ప్రత్యుత్తరాలూ లేవు శారీరక ధర్మమే సోపానంగా సృష్టికార్యం గావించే సకల జీవరాశి ఎరిగినది ఏ చదువులు.
మరి మనం నేర్చిన ,
నేర్చుకున్న చదువులు ఏవి..
నలిగిపోతున్న తెలుగు
వెలుగు బాట చూపిన
తెలుగు పంతులు నేర్పిన పద్యం
ఎటు పోయింది..
ఇబ్బందులెన్ని వచ్చినా దానిపై రంది
వద్దన్న హిందీ పండిట్ ఇచ్చిన ధైర్యం
ఎటు పోయింది ..
బంగ్లాలో బతుకే భవిష్యత్తు లక్ష్యం
కాదన్న ఆంగ్లోధ్యాపకుని మాటల అర్థం
ఎలా మారింది ..
బతికుండి ఎన్ని లెక్కలు వేసినా
ఊరి చివర కట్టెల పాన్పుపై
కాటికాపరి కర్ర దెబ్బల లెక్క మాత్రం తప్పదన్న జ్ఞానం ఏమి అయింది ..
ఎన్ని పాఠాలు నేర్చినా
మనసు చేసే
ఫిరాయింపు చేష్టలకు
మనిషి కట్టు బానిస ...
అందుకే మనసు అదుపులో ఉంచుకో
నీకున్న ఒక్క జీవితం కోసం
అక్షరాలను పేర్చి కోటలా నిర్మించుకో
చదువులు నేర్పిన జ్ఞానంలో,
జీవిత గమనం సాగిస్తూ
తెల్ల కలువలా వికసించి జీవించు...
