ఎడబాటు ఎదబాటు
ఎడబాటు ఎదబాటు
చందమామ ఓ ఛాందసుడేమో
అందమంతా దాచుకుని అల్లాడుతున్నా
విరియాలా ఇప్పుడే వెన్నెలంతా?
ఎదలోని తీయని రాగాలు
ఎగిసిగిసి పడుతుంటే
కడలి కెరటాలు చిన్నపోయేనే!
మతిలేని మలయమారుతం
గతిలేని నా దేహాన్నే తాకాలా?
ఆషాఢపు ఎడబాటుతో
ఎండిన నా దేహంతో ఏడుస్తున్నా
ఎదపై పయ్యెద జారిజారి పోతూంది
జాలిగా
చీవాట్లు వేశాను సిగ్గులేదా నీకని
పతిగా అధికారం పొందిన ప్రియా!
చిక్కిన నీ మోమును కలలో కాంచి
వెక్కి వెక్కి ఏడ్చాను
ఎన్నినాళ్ళాయేరా నీ కన్నుల కోరిక చూసి
ఎన్నినాళ్ళాయెరా అధరమున నీ పంటి గాటు పల్లవించి?
తడియారిన పెదవులతో తల్లడిల్లి పోతున్నా
నీ వెచ్చని కౌగిలి లేక వేలారి పోతున్నా
మదన పోరాటంలో గెలిచి అలసిన
నీ చెమట బిందువుల నా కొంగుతో
మరలా తుడిచేదెప్పుడోయ్?
ఆషాఢానికి ఆమాత్రం మతిలేనిదే ఎలా ?
పెళ్ళైన మూన్నాళ్లకే అడ్డమొచ్చిన
అంట్ల రాక్షసి!
పెరటి తలుపు తీసి ఉంచేను ఈరాత్రి
పరుగు పరుగున రారా
నా పరువాల కుతి తీర్చి పోరా
పోతే పోయెనులే పరువే కదా

