ధైర్యానికి సంకెళ్లు
ధైర్యానికి సంకెళ్లు
తలపులు తడిమేస్తూ
ఊహలు శరవేగంతో పయనిస్తున్నా
పాదాలు మాత్రం
ముందడుగు వేయడానికి బయపడిపోతూ
బంధనాలు బిగించుకుంటున్నాయి
చేతలకు ఊపిరినివ్వాలని
మనసు ఆరాటపడుతున్నా
చేతులు మాత్రం
నరాలు బిగించుకుని
కదలిక లేకుండా కట్టెలా బిగుసుకున్నాయి
నీతులు వల్లించే నాలుక
ముందడుగు వేయాల్సిన సమయానికి
మడతబడి మాటలురాక
మూగనోము పట్టి
పెద్దరికం ముసుగేస్తోంది
కాలానికి ఎదురీదాల్సిన
జీవన నావ అదుపుతప్పి
ఆలోచలన సుడిగుండంలో
కొట్టుకుంటున్నప్పుడు
ధైర్యానికి సంకెళ్లు పడి మునకలు వేస్తోంది
పిరికి గంధం పూసుకున్న కాయం
మీనమేషాలు లెక్కపెడుతూ
కాలం గండిపేస్తుంటే
సమస్యల వలయంలో తిరిగే
నాకు సంకెళ్లు కొత్తేమీ కాదు