చీకటి
చీకటి
నీడపడని చెలితానే..అల్లుకున్న చీకటి..!
నిదురపూల వానతనే..కురుస్తున్న చీకటి..!.
మిణుగురులే ఎగురువేళ..కాంతిపూల మౌనమె..
ఎదలోయల వెలుగుతేనె..నింపుతున్న చీకటి..!
చెరలన్నీ తొలగించే..దివ్యశక్తి మూలము..
చెలివెన్నెల సంతకాలు..దాచుకున్న చీకటి..!
భావనగా గాక అసలు..బాధెక్కడ ఉన్నది..
నిదురపుచ్చి సేదతీర్చ..పరచుకున్న చీకటి..!
మెఱుపులతో నాట్యమాడ..చోటిచ్చును తానే..
నీలిమేఘ మాలికలను..కమ్ముకున్న చీకటి..!
ఆదిపరా శక్తినిధికి..నడిపించును చక్కగ..
కనులుమూసి మూయగనే..వెలుగుతున్న చీకటి..!
కంకులలో పాలునింపు..మరిమాధవ రూపే..
గాయంలో గజలుమల్లె..పొంగుతున్న చీకటి..!

