చెలిమి విలువ
చెలిమి విలువ
చెలిమివిలువ తెలియకున్న..సమరము కద మిగిలేది..!
మధువు కోరి వేటకు దిగ..మరణము కద మిగిలేది..!
తనను తాను తెలుసుకునే..తపస్సుకే ఈ జన్మ..
మనిషిలోని మృగముతొలగ..దైవము కద మిగిలేది..!
మాటకన్న ఆయుధమే..లేదన్నది నిజములే..
పరిమళించు తీరుతెలియ..మౌనము కద మిగిలేది..!
కులమేదో మతమేదో..యుగాలుగా యుద్ధాలు..
కరుణవిలువ తెలియకున్న..కలహము కద మిగిలేది..!
బంధమేది శాశ్వతమో..పరమార్థం ఏమిటో..
మనసు పడే యాతనలో..రాగము కద మిగిలేది..!

