చైత్రమాసపు కోయిలవై
చైత్రమాసపు కోయిలవై
ఒంటరి నక్షత్రం లా ఎక్కడో
సుదూర గగనంలో నీవు
నీవెలుగులో ఛాయగ మిగిలిన నేను
కలిసి ఉన్నట్లు అనిపించినా
కలువలేని సమాంతర రేఖలం
నీదో దారి నాదో దారి
ఎందుకో మనమధ్యఈ అనుకోని దూరం
నేనెప్పుడూ వాసంతపు విరుల జల్లునే
అదేమిటో నువ్వెప్పుడూ గ్రీష్మపు సెగల పొగవే
నేనెప్పుడూ హేమంతపు చామంతుల మాలనే
నీ మెడ ఒంపున అలవోకగా అలా ఒదిగితేమురవాలని
కానీ నువ్వేమో ముద్ద గట్టిన
మూస గాంభీర్య శిల్పానివి
నేనేమో స్వేచ్ఛాపిపాసినైన
రంగుల సీతాకోకచిలుకను
నువ్వేమో మౌన సంద్రపుహోరువి
నేనేమో పారే సెలయేరు గల గలలఅలజడిని
మెత్తగా నవ్వే నీ నవ్వుల పువ్వులు
ఎప్పుడు నాకై రాలునో అని నా ఆశ
నీకై పరుగెడుతున్న నా ఆశల గుర్రాలకు
ఒకే ధ్యాస ఎప్పటికైనా నిన్ను చేరుకోవాలని
శిశిరమల్లే మోడువారిన నామనోకొమ్మను
వలపు వసంతమై నువ్వు నన్నుతాకితే
చైత్రమాసపు కోయిలై ఎద
కూయని తీపి కుహురాగాలు పాడదూ
గుండె వాకిట నీ తలపులతోరణాలు కట్టి
మదిగదిలో మ ల్లెల ఊయలలో నిన్ను ఊపేయాలనిఉబలాటం
అంతేనేమో చైత్రమాసపుగాలిలో
పరిమళమై నను నువ్వు తాకుతుంటే

