బాల్య స్మృతులు
బాల్య స్మృతులు


అందమైన సాయం సమయం
వర్షానికి తడిచిన సోయగం
కాగితపు పడవలతో పిల్లల ఆటలు
కదిలెను నాలో బాల్య స్మృతులు
పెదవులపై విరిసెను చిరునవ్వులు
మెదిలెను మదిలో నాటి అల్లరులు
వేసవికాలంలో బడికి శెలవులు
వెంటనే అమ్మమ్మ ఊరికి పరుగులు
సావాసగాళ్ళతో కట్టి జతలు
చేసేం మితిమీరిన అల్లరులు
ప్రొద్దున్నే మేల్కొల్పే సూర్య కిరణాలు
సుప్రభాతం పాడే పక్షుల కువకువలు
అమ్మమ్మ పాడే మేల్కొలుపు పాటలు
పల్లె రైతుల నోట జానపద గీతాలు
ఎండల్లో వీధుల్లో షికారులు, ఆటలు
తాతయ్య గద్దింపుకి దొంగ ఏడుపులు
అమ్మమ్మ కంగారుగా బుజ్జగింపులు
మామయ్య చాటుగా ఇచ్చే తాయిలాలు
ప్రొద్దున్నే అమ్మమ్మ పెట్టే చద్దన్నాలు
మామయ్య తో తోటల్లో షికార్లు
మధ్యాహ్నం తోటి పిల్లలతో ఆటలు
సాయం కాలం చెరువులో ఈతలు
ఆటపాటలతో అలసిన శరీరాలు
అమ్మమ్మ ప్రేమతో పెట్టే గోరుముద్దలు
ఆరుబైట వెన్నెల్లో తాతయ్య కథలు
అమ్మమ్మ జోలపాటతో పవళింపులు
ఇంతలో వచ్చి అంతలో పోయే శెలవులు
బడి తెరిచే వేళకు రమ్మని ఉత్తరాలు
వెళ్ళడానికి మొరాయించే పిల్లలు
మళ్లీ వద్దురు లెమ్మని ఊరడించే పెద్దలు
తప్పని సరియై కదిలే పిల్లలు
బాధతో నిండే పెద్దల మనసులు
వదలలేక వదిలే తోటి స్నేహితులు
మళ్లీ వచ్చే వేసవికై ఎదురు చూపులు
అందమైన ఆనాటి బాల్యం
నేటి కాలంలో ఎవరికి లభ్యం