బాధకు ఓ మనవిని..చేస్తున్నా ఆలించమని..!
ప్రేమకు మూలం నీవని..నా ప్రాణాలకు ప్రాణమని..!
ఓ భరోసా ఇస్తున్నా..తనకోసం నే ఉన్నానని..
కడయెలేని కడదాకా..గుండెతడిగ ఉంటానని..!
ఇంకెలా చెప్పగలను..నువ్వంటే యమ ఇష్టమని..
తేలికెంత పడతానో..నన్నల్లుకు నీ వున్నావని..!
నీవూ నేనూ ఒకబిందువు..సాక్షిగనే పుట్టామని..
ప్రవహించే ఏకత్వపు..కాంతినదీ పాయలమని..!
వేణునాద సుధలోను..కోకిల పాటలోను కలమని..
చెలరేగే కలకలమది..రాల్చేసే నిజ యోగులమని..!
అశ్రుఝరిని నిలువరించి..ఓదార్చే జ్ఞానులమని..
ఎఱుకగాను జీవించే..భాగ్యమిడే విరాగులమని..!