అసలు
అసలు
పిచ్చివాణ్ణి అయ్యానని..చెప్పలేను అసలు..!
పడిపోయిన మనసుకథను..పాడలేను అసలు..!
బాధించే గాయమేది..మిగిలిలేదు ఇపుడు..
ఆనందమె చెలియైనది..చూపలేను అసలు..!
తెఱిపిలేని అగ్గివాన..పడుతున్నది లోన..
దాహానికి నీటికొఱకు..వెతకలేను అసలు..!
నీలిమేఘ రాగాలకు..స్వరములేవొ ఏమొ..
నిత్యమౌన సుధనుగాక..పంచలేను అసలు..!
అక్షరాల శ్వాససాక్షి..అద్భుతమే బ్రతుకు..
మెతుకువెనుక పరుగేదో..పెట్టలేను అసలు..!
ముక్తివీణ తనువన్నది..తెలిపినదే తాను..
అనురక్తికి చోటునింక..నిలుపలేను అసలు..!
