"అర్ధాంగి"
"అర్ధాంగి"


నా కవితల తోటలో
విరబూసిన ఓ పారిజాత పుష్పమా
నా ఆశల లోకంలో
వికసించిన ఓ వేకువ కిరణమా
నా ఊహల పల్లకిలో
మోస్తుంది నీ ఊసుల జ్ఞాపకాలే
నా రాత్రుల కనులలో
కంటుంది నీ రూపపు కలలే
అందని ఓ అదృశ్య అందమా
అగుపించని ఓ అపురూప ఆకృతమా
వినిపించని ఓ నక్షత్ర శబ్దమా
కరుణించని ఓ వెన్నెల చంద్రమా
నీ రాక కోసం నా కనులు రెండూ ఎదురుచూసే,
నీ పిలుపు కోసం నా చెవులు రెండూ అలుముకునే,
నీ పేరును స్మరిస్తూ నా పెదవులు రెండూ అలసిపోయే,
నీ కౌగలికి పరితపిస్తూ నా కరములు రెండూ సాగిలపడే.
నదిలాంటి నా మనసు ప్రవాహంలో
రాయి లాంటి నీ జ్ఞాపకాలను విసిరేసి,
అ
ది సృష్టించిన ప్రేమపు అలల అలజడిని
ఆస్వాదించనంటూ నువ్వలా వదిలేసి వెళితే ఎలా?
కోవెలలో హారతిలా వెలుగొందిన నా స్వచ్ఛ ప్రేమ భావం
ఆఖరి చితి మంటై నీ ఆశలను దహించివేసిందా...
నీకై నిరంతరం పరితపిస్తున్న నా పిచ్చి మనసు పాపం
వేదనల నీటి అలలై నీ ఆశయాలను హరించివేసిందా...
నిర్మలమైన నీ యద లోగిళ్ళలో...
సృష్టించిన నా అనుభూతుల ఆశలను,
హృదయ స్పందనలనే తీగలతో మ్రోగించనా ?
బంధమనే ఓ చక్కటి గానాన్ని నీకై ఆలపించనా ?
స్వచ్చమైన నీ మది పుస్తకంలో...
అమర్చిన నా ఆలోచనల అక్షరాలను,
మనసు భావమనే కలముతో లిఖించనా ?
ప్రేమతో నా ఈ అద్బుత కావ్యాన్ని నీకందించనా ?