అనురాగ దేవత
అనురాగ దేవత
ఓయ్ !
ఎందుకు ప్రేమించాలోయ్ నిన్ను ?
కోరినపుడు రావు పోరినా
దూర దూరంగా జరుగుతావు
కవ్విస్తావు కన్ను గీటుతావు
పకపకా నవ్వుతావు
వెన్నెల కురిపిస్తావు
వేడి పుట్టిస్తావు
వెఱ్ఱివాణ్ణి చేస్తావు
వెనుదిరిగి పోతావు
ఎందుకు ప్రేమించాలోయ్ నిన్ను ?
సిద్ధంగా లేను నేను
వద్దన్నపుడు బుద్ధిగా వస్తావు
సద్దు చెయ్యక కౌగలిస్తావు
గట్టిగా గాఢంగా
ముద్దులు పెడతావు
ముగ్గులోకి దించేస్తావు
పట్టుకెళతావు నన్ను
మరో లోకానికి
మరణమా !
నా అంతిమ చరణమా !
నా అనురాగ దేవతా !
మాటలు చాలవోయ్
అంత ప్రేమోయ్ నీవంటే
రాగమే కాని ద్వేషమెరుగని దానివి
పాప పుణ్యాలను బేరీజు వేస్తూ
కర్తవ్య పాలనకు కట్టుబడిన దానివి
గుణకారాలూ భాగహారాలూ చేసి
శేషాన్ని బట్టి మమ్ము శోషించే దానివి
రమ్మంటే వస్తావా
పొమ్మంటే పోతావా
నాకు తెలుసు
నాకు తోడు ఎవ్వరూ రారని
పత్నియైనా పుత్రలైనా
కడవరకూ వచ్చేదానివి నువ్వేకదా
మందహాసంతో మట్టిలో కలుపుతావ్
మృత్యు దేవీ !
ఒక్క కోరికరా నాది
ఊ అంటావుగా
నీకు తెలుసుగా
నాకెంత ప్రేమో
అక్షరాలన్నా
బంగాళాదుంప చిప్స్ అన్నా
నాలుగు అక్షరాలు
అన్నే మూటల చీప్సూ
నా సమాధిలో ఉంచు
మెలుకువ వచ్చినప్పుడు
చిప్స్ తింటూ
నాలుగు ముక్కలు వ్రాసుకుంటాను

