అమ్మా..
అమ్మా..
అమ్మ
నాన్నే లోకమై బ్రతికేది
నేను పుట్టే వరకు!
నేను పుట్టాకా
తన లోకమే నేనైపోయా!!
తన ఆకలినీ మరిచిపోయేది
నా ఆకలి తీర్చేవరకు!
తన పనులనే ఒదిలేసేది
నా పనులు చక్కబడే వరకు!
తను నవ్వడమే మర్చిపోయేది
నేను ఏడుస్తున్నంతసేపు!
తను నిద్రపోవడమే మరచిపోయేది
నాకు నలతగా ఉండి నిద్రపోనంతసేపు!
నా చదువులకోసం -
తను హైరానా పడేది!
నా భవిష్యత్తుకోసం -
తను కలలు కనేది!
నన్ను ఎవరేమన్నా -
తను సివంగిలా మారేది!
బహుశా అమ్మంటేనే అంతేనేమో!?
తనకోసం కాక -
తన పిల్లలకోసం ఆలోచించడమే తెలిసేలా!!
అమ్మ పంచే ప్రేమ ఒకేలా ఉంటుందేమో!?
అన్నం పెట్టమ్మా అంటే -
అమృతాన్నే తన ప్రేమతో కలిపి పెట్టేలా!!
బహుశా అమ్మ ఎవరికైనా ఒకటేనేమో!?
రాముడికైనా!
రావణుడికైనా!!
నన్ను కన్న అమ్మైనా!
నా బిడ్డల్ని కన్న అమ్మైనా!!
అమ్మంటేనే అమృతమూర్తేమో!?
అచ్చంగా మా అమ్మలా -
నడిచే దేవతేనేమో!
అమ్మకు ప్రేమతో......
అమ్మలందరికీ భక్తితో........
- సిరి ✍️❤️
