అలసిన మనసు
అలసిన మనసు
అద్దంలా అందరికీ ఉపయోగపడి
వికలమై పగిలిన నిన్ను చూసి
ఎదురొస్తే ఏమడుగునో అని
తప్పుకు తిరిగే బంధుమిత్రులతో
సంపద చూసి గౌరవమిచ్చే సమాజంపై
అలుపెరగని ఆలోచనల సుడులతో
అలసి వేసారిన మనసుకు కుదురుగా
కూర్చుని కూసింత కుదుటపడనివ్వు
ఉరుకుల పరుగుల ఈ నీ జీవనంలో
పట్టించుకోని ప్రకృతి ప్రశాంత గమనం చూడు
ఆర్భాటపు ఆనందాల వెతుకులాటలో
కోల్పోయిన సృష్టి సింగారాలు చూడు
చిరు గాలికి గల గల లాడే
ఆకుల గుసగుసలు విను
సాకేత రామునికే సాయ మొనరించిన
ఉడుత పిల్లల ఉత్సాహం చూడు
మాదే సంగీతమని మిడిసిపడే
పిట్టల కువ కువ రాగాలు విను
మళ్ళీ మళ్ళీ చిగురించే చిగురాకుల
చిరుసరి నవ్వులు చూడు
క్రుంగదీసే రాత్రుల వెనుకెనుకే
ఉత్తేజ పరిచే ఉదయాలు కూడా...
వస్తాయని తెలిపే ఈ ప్రకృతి
పరివర్తన సూత్రం చూడు మిత్రమా
