సామాన్య భక్తుని సాహసయాత్ర – చార్ ధాం యాత్ర
సామాన్య భక్తుని సాహసయాత్ర – చార్ ధాం యాత్ర
సామాన్య భక్తుల సాహస యాత్ర - మన చార్ ధాం యాత్ర
అతి పవిత్రము హరిద్వారము –
దేవభూమికిదియే ప్రవేశద్వారము
సహేతుక కోర్కెలు తీర్చు మానస దేవి,
మహిమాన్విత రూపం చండీదేవి.
నయనానందము గంగా హారతి -
చార్ ధాం యాత్రకు ప్రథమ మజిలీ
కష్ట సాధ్యము, భక్తి వశ్యము - యమునా దేవి దర్శనము.
సూర్యపుత్రిక యమునోత్రి, కాలాయముని గారాల సోదరి.
వణికే చలిలో గుర్రపు డెక్కల చప్పుడులో…..
ప్రతి అడుగు ప్రాణ సంకటం - ఆద్యంతము ఉత్కంఠభరతం
చల్లని తల్లి వెచ్చని ఒడిలో
ఉడుకు స్నానం – ఒక అద్భుతానుభవం
ఉబుకుతూ ఉరుకుతూ జాలువారుతూ –
ఉరకలు వేసే చంచల యమునా
నిశ్చల ప్రశాంత రూప దర్శనం -
జన్మ జన్మల సాఫల్యం
సగర కుల యువరాజుల సద్గతికై
భువికి దిగెను భాగీరథియై
అలకనందతో సంగమించిగా
అవతరించెను గంగానదిగా.
పరమ ప్రవిత్రము గంగా స్నానము
హైందవులది ఇహపర సాధనము
చితి భస్మమై గంగా సంగమం
మోక్ష ప్రదం, జన్మ రాహిత్యం!!!
జీవన వాహిని గంగా జననీ
జన జీవన ప్రదాయిని గంగా వాహిని
కఠినతరము కేదారుని కడకు ప్రయాణము
కొండలు, గుట్టలు, వాగులు వంకలు, దుర్గమ మార్గములు
భక్తసులభుడనుట సత్యదూరములు
హిమగిరి శిఖరాల నడుమ నిలచిన
ప్రళయాని ఎదురొడ్డి నిలచిన ధామము
మైనస్ చలిలో వెచ్చని స్పర్శ దర్శనం
భక్తి కరిగెను భాష్ప రూపమై
నర నారాయణులు తపమోనరించిన భూమి
ఒకటిని వేయిని చేసే మహిమాన్విత భూమి
అలకనందా తీరము - తప్తకుండ ఉడుకు స్నానము
పితృదేవతల శాశ్వత మోక్ష ప్రదాయిని బ్రహ్మకపాలము
బదరీవిశాలుని దర్శనము - ఇహపర బంధాల విముక్తము
కొండలు, బండలు, రాళ్ళు, రప్పలు
ఉరికే నదులు, దుమికే పాతాలు
యమునా, గంగోత్రి, కేదార, బదరీ దర్శనాలు
మహిమోన్నత హిమగిరి సొగసులు - జీవిత కాలపు జ్ఞాపకాలు
ఇప్పటికైనా వికసించాలి మన మనసులు
సామాన్య భక్తుల సాహస యాత్ర మన చార్ ధాం యాత్ర
.... ... నగేశ్ పుల్లేటికుర్తి
