నువ్వంటే నాకిష్టం
నువ్వంటే నాకిష్టం
నువ్వంటే నాకిష్టం ... నీ నవ్వంటే నాకిష్టం....
విరిసి విరియని సన్నజాజిలా
మురిసి మురియని ముద్ద బంతిలా
గుండె లయ తప్పించే గులాబీలా
నూతన సంవత్సరపు పూల బొకే లా ఎదురొచ్చే
నువ్వంటే నాకిష్టం ... నీ నవ్వుల పూలంటే నాకిష్టం.
గాలికి ఊగే కురుల అలల దరి
నీ కనులుచూసి మేం కన్ఫ్యూజయ్యాం
అవి కలువ రేకులా? చేప పిల్లలా?
అటు ఇటు బెదిరే చూపుల్తో సైకిల్ పై నువ్వెదురొస్తుంటే
గుబ గుబ లాడే గుండెల్తో మేం ఫ్యూజులు పోయి పడి చచ్చాం
నువ్వంటే నాకిష్టం ... నీ కళ్ళంటే నాకిష్టం.
సరి మువ్వల చిరు సవ్వడితో
హంసల నడుమ రాయంచ నడకతో
పుణ్యం కరిగి భువికి దిగిన
కథలో శకుంతల క్లాసులోకొస్తే బిత్తరపోయి మేం పరవశులయ్యాం
నువ్వంటే నాకిష్టం ... నీ నడకంటే నాకిష్టం.
జల జల జారే జలపాతాలు
కిల కిల పక్షుల కువకువలు
పిల్ల తెమ్మెరల కూని రాగాలు
ముద్దు మోముతో తేనె పలుకులు
నా మదిలో మొలకలు తొలకరి ప్రేమకు
నువ్వంటే నాకిష్టం ... నీ మాటంటే నాకిష్టం.

