అక్షరకర్షకులు
అక్షరకర్షకులు
కనిపించని వాటిని కూడా
కళ్ళముందు ప్రత్యక్షం చేసి
ఉప్పొంగే కెరటాల రెక్కలతో
తీరం పరుగు తీసే అక్షర వరసలు..
భావాలన్నీ రెక్కలు తొడుక్కొని
తెల్ల కాగితంపై వాలిపోయే సొంపులు
ఉద్వేగాలు ఉరుకులు పరుగులు తీస్తూ
మనో ఫలకం పై గీసుకున్న చిత్రాలు...
నడిరేయి కూడా నిద్ర లేస్తూ
వెన్నెల్లో కూడా విహరిస్తూ
నక్షత్ర మండలాన్ని అక్షరాలతో కలుపుతూ
నింగిలో విహరించే చందమామ రూపాలు ...
జీవనదిలా పదాలు ప్రవహిస్తూ
మనసుల వెంట పరుగులు తీస్తూ
ఎడారి మనసును వసంతంగా మారుస్తూ
కలం కాగితపు పంటలోని ఫలాలు...
గుండె చప్పుళ్లను మూసుకుంటూ
నలుగురిని మెప్పించుకుంటూ
పదాల పదనిసలతో సాగిపోతూ
హృదయ వీణలు పలికించే స్వరాలు..
రూపము లేని శిలలకు జీవం పోస్తూ
రేఖాచిత్రానికి వర్ణాలు అద్దుతూ
ప్రాణం లేని వాటికి అక్షరాలతో ప్రాణం పోస్తూ
చక్కని అక్షర శిల్పాలు నిర్మించే శిల్పులు..
చేతికి అందని వాటిని
మనసు చేతులతో అందుకుంటూ
ఇంద్ర ధనుస్సు రంగులో తేలుతూ
అక్షర సొగసులు నింపిన అలంకారికులు...
యుద్ధాలను నిషేధిస్తూ
అక్షరకపోతాలను ఎగురవేస్తూ
విశ్వశాంతికి గీతికను ఆలపిస్తూ
ప్రపంచానికి ప్రేమ పంచిన ప్రేమికులు.
గుండె లోతుల్ని కొలుచుకుంటూ
గుండె గాయాల్ని మానుపుకుంటూ
అక్షరపు మత్తులో తులతూగుతూ
విషాద గీతాల ఆలాపక నిషాదులు..
మనసుకు రెక్కలను కట్టుకొని
అనంత లోకాల్లో విహరిస్తూ
ఆత్మానందాన్ని నిత్యానందంగా మార్చుకొని
స్వర్గ లోకపు అమృతపు వీచికలు..
విజ్ఞానపు తోటలో విహరిస్తూ
అజ్ఞానపు చీకట్లను పారద్రోలుతూ
అక్షరమే వెలుగుగా కదులుతూ
కవన సేద్యం చేసే అక్షరకర్షకులు
