ఐలవ్ యు
ఐలవ్ యు
గుర్తుంది నాకు..
బడికి పంపునపుడు మీ నాన్న ఇచ్చిన
మిఠాయీలను దాచి
తిరిగి తెచ్చేవాడివి
నాకోసం..
నా చిరునవ్వుకోసం !
అప్పుడనే వాడివి
"ఐ లవ్ యూ" అని
మౌనం దాల్చిన నేను......
గుర్తుంది నాకు....
నీవు దాచుకున్న పైసలతో
నాకు ఇచ్చేవాడివి పూలమొక్కలు కొని
నా తోటలో పెంచమని
నాకోసం
నా చిరునవ్వు కోసం
ఎప్పటిలా"ఐ లవ్ యూ" అంటూ
నేను మవునంగానే....
తిరునాళ్లకు తీసుకెళ్లి
జయంట్ వీల్ ఎక్కించావ్
నాకోసం
నా చిరునవ్వు కోసం
భయవిహ్వలనై నిన్ను వాటేసుకుని
వెర్రికేకలు వేశా
ఎప్పటిలానే "ఐ లవ్ యూ "చెప్పావ్
నేను మవునంగానే....
నీకు కాన్సర్ వచ్చిందని
చూడడానికి వచ్చాను
చిరునవ్వు నవ్వావ్
బాధనంతా గుండెలో కుక్కి
నాకోసం
నా చిరునవ్వు కోసం
ఎప్పటిలానే"ఐ లవ్ యూ" అన్నావ్
నేను మవునంగానే......
చివరిసారి నిన్ను చూసింది
స్మశానవాటికలో
మ్రింగబోతూంది నేల నిన్ను
నానుండి నిన్ను వేరుచేస్తూ
శాశ్వతంగా...
నీవు చెప్పలేదు మామూలుగా "ఐ లవ్ యూ" అని
నా మెదడు పగిలిన నీటిని
కన్నీరుగా కారుస్తూ నేనే చెప్పా
"ఐ లవ్ యూ ఐ లవ్ యూ"

