అదిగో పులి..
అదిగో పులి..
ఇదిగో తోక
అని చెప్పే పని లేదు
లక్ష్యం ఎదురుగా ఉంది
గాండ్రింపులతో పులి
భటులు పేర్చిన వ్యూహంలో చేరింది
మదపుటేనుగుల ఘీంకారాలతో
గుర్రపు డెక్కల చప్పుళ్లతో
వివిధ విన్యాసాలతో
కమ్ముకుంటున్న ధూళితో
మైదానం కొత్తగా అనిపించసాగింది
నలు వైపులా చూసి
పరుగెత్తిన పులి పట్టు తప్పింది
బోర్లా పడి లేచేంతలో
తాకితే తెగిపోయేలా ఉన్న బల్లెం ఒకటి
పులి పొట్టను పలుకరించింది
నిలబడాలని చేసిన ప్రయత్నం
విఫలమై విసిగించి
గాయాల మీద గాయాలకు లొంగి
కింద భూమిని రక్తంతో తడిపేసింది
ఎక్కడో ఖర్జూరాలు తింటున్న సుల్తాన్ కి
కోటలోని సింహాసనానికి
పులి చర్మం అలంకరణ లీలగా తోచింది
కొన్ని నవ్వులు
మరి కొన్ని ఆశ్చర్యాల మధ్య
పులి దేహం కోటకు చేరుతోంది..
