అచ్చం అమ్మ లాగే..
అచ్చం అమ్మ లాగే..


పచ్చగా.. కొండపల్లి బొమ్మ లాగా ఉన్న అమ్మ
నాకు ఒక ఆశ్చర్యం.
ఆమె చీర కట్టుకునే తీరు,
బొట్టుపెట్టుకొనే వేలి కొసలు
కాటుక దిద్దిన కళ్ళు..
ఒక్క క్షణం..ఇదిగో వస్తున్నా.. అంటూ
చెంగున గెంతే చలాకీతనం..
ప్రతీదీ నాకు మహదాశ్చర్యం.
పాఠం చెప్తున్నంతసేపు ఆమె కళ్ళలో
ఏదో చైతన్యం..
బడిపిల్లలు వేసే యక్ష ప్రశ్నలకి
తానే ఒక నడిచే విజ్ఞాన సర్వస్వం.
ఇంటిగంట తరువాత
అరగంట నడక దూరం అలవోకగా
తాను నడిచేస్తున్నప్పుడు..
అప్పుడూ..
జీవితంలో ..నేను పాప నుంచి
ఒక పాపకి అమ్మగా మారిన
ఈ క్రమంలో ఇప్పుడూ...
ఎప్పుడూ..
వెనక పరుగెడుతూ తనని అందుకోడానికి
నే పడుతున్న అలుపు కెరటంలో
ఆమే నా గెలుపు చిరునామా.
వత్తిడి లో సైతం చెరగని చిరునవ్వు..
కష్టంలో సైతం తొలగని ఆత్మస్థైర్యం..
అశక్తత అంచున ఉన్నా
ఒకరికి ఆలంబనగా నిలబడగలనన్న సంకల్పం..
అమ్మా... నీకు మాత్రమే ఎలా సాధ్యం!!?
అందుకే
చిన్నప్పటినుండి కోరుకుంటున్నా
నా ప్రతి అడుగునా చైతన్యం తొంగిచూడాలి..
నా కలలన్నీ రంగురంగుల సొబగులద్దాలి...
కాలమే నా మూర్తిమత్వం తీర్చిదిద్దాలి..
నా చిన్ని పాపకి నేను కూడా ఒక స్ఫూర్తి కావాలి..
అచ్చం ..మా అమ్మ లాగా..