ఆశల దాహం
ఆశల దాహం
బతుకు అర్థం చెప్పాలి ఆశలు, ఆశయాలు
బతుకులకు మార్గం చూపించాలి
ఆశల దాహం తీరనిదైతే
వాగులు, నదులను గుటకాయ స్వాహా చేసేదైతే
కలుపులా విస్తరించి దెబ్బతీస్తది అసలు పంటను
అత్యాశల దాహానికి హద్దులుండవు
చెట్ల మీద ఇస్తరాకులు కుట్టి
గాలిల ఊహల విమానాలు ఎగరేసి
ఇతరుల కలల కష్టాలను కాటికి చేర్చి
సామ్రాజ్యం ఏర్పాటు చేసుకుంటది
విజయవంతమైన ఆశల దాహం జిగురుకు
దొరికితే పాలకుల చీకటి అండ ఐతరు కార్పొరేట్లు
చిల్లర బేరాల నుంచి దేన్ని వదలని దూప
మొక్కలకు అంటు కట్టినట్లే మనుషులకు విస్తరిస్తది
వ్యాపారీకరణ ఆకర్షణతో దోచుకుంటది మనసులు
ఒకసారి మొదలైందంటే ఆశల దాహం
నిలువెల్ల బంగారంతో నిండినా కుతి తీరదు
దాహం రీతులు మారుతాయి
వాగులను మింగేసి కాలువలను పంచి
దాతల జాబితాలో దండివాడవుతాడు
గురివింద గింజలా ఉన్నా
నీతులు వల్లించి నిప్పునంటాడు
అదే నీతిగా విస్తరిస్తుంది జనాల్లో
ఆశల దాహం పొలానికి హద్దులుంటే
పండించే పంటలేవైనా ఇస్తాయి తృప్తి
మనసుకు, మనిషికి దొరుకుతుంది మనశ్శాంతి
కానీ ఎక్కడా కనిపించదు, వినిపించదు
