ఆరోగ్యమే మహాభాగ్యం
ఆరోగ్యమే మహాభాగ్యం
ఆయురారోగ్యములగోరి యవని యందు
పలురకంబులౌ పద్ధతుల్ వరలుచుండ
మేలుగా వాటిని పాటించి మెల్గుజనులు
మంచి యారోగ్యమునుబొంది మహిని తిరుగ
సంతసమ్ముగ బ్రతుకులు సాగుచుండు.
ఆకు కూరలన్ దినినచో నధికబలము
కూరగాయలు మనకిచ్చు కోటినిధులు
పాలు పండ్లను సేవింప బలము కలుగు
చారు రసములన్ సేవింప జలుబురాదు
ధాతు పుష్టిని కలిగించు ధాన్యములను
పప్పు దినుసులన్ మానక వండి తినగ
పుష్టి కలుగగ రక్తంబు పొరలుచుండు.
రోటి పచ్చళ్ళు తినుచుండ రోగముడుగ
నూర గాయలన్ మానంగ నుప్పుతగ్గి
రక్త పోటిక రాదులే శక్తి మిగులు.
ఆలుగడ్డలన్ తగ్గించ నదుపులోకి
బరువు వచ్చును జనులార!భయము వలదు.
యోగసూత్రముల్ పాటించ నున్నతముగ
శ్వాసకోశపు నాడులే చక్కబడును.
దినము కొకమారు నడిచిన తీరుమారి
తనువు యందున్న గ్రొవ్వులే తగ్గిపోవు.
కొంత జాగ్రత్త పాటించి కుదురు తోడ
బయటి తిండిని తగ్గించ బ్రతుకు మిగులు.
పుష్టి కలిగించు నాహారములను దినుచు
జనులు వర్థిల్ల పుడమికే జయము కలుగు.
నీరసంబుగ మనుజులు నిదురపోవ
భావి తరముకు మిగలదు భవిత యనుచు
కండ పుష్టిని కలిగించు తిండి తినుచు
మనుజులందరు వర్ధిల్ల మహికి జయము //
---------------------
