ఆకాశం
ఆకాశం
రంగులు మారుతున్న ఆకాశమంతటిని
హృదయంలో బొమ్మ కట్టలేక సతమతమౌతున్నా
కవినై అక్షర రూపం ఇచ్చినా
చిత్రకారునిగా కుంచెకు పనిచెప్పినా
కెమెరాతో ఎన్నిసార్లు క్లిక్ మనిపించినా
ఆత్మసంతృప్తి చెందని ఆవేదనలు
ఆకాశానికి మోసపు బాణాలు వేయడం తెలియదు
సగం సగం కడుపు నిండినప్పుడు సానిపి జల్లు చినుకులో,
కక్కొచ్చినప్పుడు కుండపోతు వానలో
కాలం కలిసొచ్చినప్పుడు పంటలకు
పదునైన కాలువలో అందిస్తది సంఘర్షణ లేకుండా
వాకిట్లో పడుకున్నప్పుడు ఆకాశం పలకరిస్తది
ఓరిమితో చూస్తుంటే చందమామ
వెన్నెల భామలతో ఆటాడిస్తడు
చమకు చమకు మంటూ చుక్కలు మురిపిస్తాయి
దినమైనా రాత్రైనా, సమయం ఏదైనా
ఆకాశం మహా గ్రంధమై మెదడుకు మేతవుతుంది
