STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

ఆగిన కాలం - ఆగిన మనసు

ఆగిన కాలం - ఆగిన మనసు

1 min
214

ఘటీయంత్రపు కరాలు

ఆగిపోయాయి అక్కడే !

కాలం జరగడం లేదు

సమయం తరగడం లేదు

మనోగతి ఆగడం లేదు

దేహతాపం తీరడం లేదు

కోడి కూసేను జాముక్రితమే !

సూరీడు జాడలేదు...

నా రేడూ రాలేదు...

ఎదురు చూచే కనులు

ఎన్నో ఉన్నాయని

స్పృహలేదేమో ఆ ఇద్దరికీ !

రేతిరంతా ఛాయతో

రతిక్రీడా వినోదంతో మునిగి

అలసి సొలసి పరున్నాడేమో ప్రభాకరుడు!

అలిగి ఇల్లు విడిచిన సంజ్ఞను

వెతుకుతూ దారి తప్పెనేమో దివాకరుడు!

రండి రండి కొంగలారా!

రారండి కపోతములారా!

దారితప్పిన రవిని వెతికి తెస్తాము

అరెరే !

చీకటి మేఘపు దుప్పటి కప్పి

శయనించాడేమిటి సవితుడు ?

దుప్పటి లాగెయ్యండి

చప్పున లేపేయ్యండి

అతనొస్తేగాని నా వలకాడు రాడు 

ఉషోదయానికి నా కౌగిలిలో

ఉంటానని బాస చేశాడే !

ఆ వీచే గాలి ఏ కొమ్మల ఆకులతో

చిలిపిచేష్టలు చేసి వచ్చిందో!

నన్ను చల్లగా తాకి

అగ్గి రాజేస్తుంది !

ఆ కూసే మత్తకోకిల 

విరహపు మత్తును

రెచ్చగొడుతుంటే

ఎలా ఓపగలను ?

మొయిలు కురిపించే చిరుజల్లులో

తడిసి ముద్దైనా

తాపమారలేదు

సర్వాంగ స్నానమాచరించినా

దేహంలోని ఏ అణువుకూ

దాహం తీరలేదు..

తలగడ చెప్పగలదు

అతనొస్తే నా విరహబాధను విస్తరముగా

నే కప్పిన దుప్పటి చెప్పగలదు

ఆర్తితో అలమటించిన నా దేహ ప్రత్యేకాణువులేమో

దైవమా !

పూవులాంటి సున్నిత పుచ్చడికపై

ఇంతటి క్రూరత్వమా !

తేలిపోతూంది నా మది

దూది పింజలా...

వ్రేలాడుతున్నాను 

నేలకూ నింగికి నడుమ !

మరణిస్తానేమో

నా మరుడి మదన ప్రేరణ వీక్షణాలు

చూడకుండానే...

మరణిస్తానేమో

చెలికాడి చిలిపి నవ్వులు 

నే వొత్తుకోకుండానే...

మరణిస్తానేమో

ప్రియుని బిగికౌగిలిలోని

వెచ్చని సుఖం ఆస్వాదించకనే

మరణిస్తానేమో

అలసిన నా దేహపు స్వేదం

అతడి జిహ్వతో తుడవకుండానే...

ఒకవేళ మరణిస్తే

అరనిముసనైనా 

నా సమాధిపై బోర్లా పరుండి పొమ్మనవా!

ఒక్క బొట్టు

ఒకే ఒక కన్నీటి బొట్టు 

విడిచిపొమ్మని చెప్పవా !

శాంతిగా నిదురిస్తాను

గాఢంగా ! శాశ్వతంగా !



Rate this content
Log in

Similar telugu poem from Romance