Venkata Rama Seshu Nandagiri

Abstract

4  

Venkata Rama Seshu Nandagiri

Abstract

సమస్య

సమస్య

3 mins
275


ఆఫీస్ నుండి వస్తూనే అలసటగా సోఫాలో వాలిపోయాడు హర్ష. "అమ్మా, కొంచెం కాఫీ ఇస్తావా. తల బద్దలై పోతోంది." అన్నాడు‌ కళ్ళు మూసుకొని.

కాఫీ కలుపుకుని తీసుకుని వచ్చిన హర్ష తల్లి కమలమ్మ " బాబూ, కాఫీ తీసుకో." అంటూ తనూ పక్కనే కూర్చుంది.

కాఫీ అందుకొని "థాంక్స్ అమ్మా. ఇంతకీ నాన్న గారికి ఎలా ఉంది?" అడిగాడు హర్ష, కాఫీ తాగుతూ.

"ఫర్వాలేదు, బాగానే ఉన్నారు. సాయంత్రం మెల్లగా నా చేయి పట్టుకొని హాల్లోనే వాకింగ్ చేశారు. నేనే ఎక్కువగా చేయవద్దని కూర్చో పెట్టాను." అంది కమలమ్మ కొడుకు చేతిలో కాఫీ కప్పు అందుకుంటూ.

" నాన్నగారు లేచి ఉన్నారా. ఒకసారి పలకరించి వస్తాను." అన్నాడు లేస్తూ.

"లేదు బాబూ, ఇందాకే మాత్రలు వేసుకొని పడుకున్నారు. నువ్వెళ్ళి ఫ్రెష్ అయి రా. భోజనం చేద్దాం." అంది కమలమ్మ

"అయ్యో, నువ్వు తినలేదా అమ్మా. రోజూ నాకు తొమ్మిది దాటుతోంది కదా. నువ్వు తినేయమ్మా. నాకోసం చూడకు." అన్నాడు హర్ష నొచ్చుకుంటూ.

"దానికేముందిరా, ఫర్వాలేదు. నువ్వెళ్ళి రా. నేను ఈ లోపున అన్నీ సర్ది పెడతాను." అంటూ కమలమ్మ వంటగదిలోకి వెళ్ళింది. హర్ష స్నానానికి వెళ్ళాడు.

కమలమ్మ, రామారావు గార్లకు లేకలేక పుట్టిన ఏకైక తనయుడు హర్ష. రామారావు గారు పోస్టల్ డిపార్ట్మెంట్ లో పనిచేసి ఈ మధ్యనే రిటైర్మెంట్ తీసుకున్నారు. హర్ష ఎం.బి.ఏ చేసి ఆరు నెలల క్రితం మంచి కంపెనీలో ఉద్యోగం సంపాదించాడు.

అనుకోకుండా రామారావు గారికి 15 రోజుల క్రితం మైల్డ్ హార్ట్ ఎటాక్ వచ్చింది. తల్లీ కొడుకులు తల్లడిల్లి పోయారు. అదే సమయంలో ఆఫీస్ లో కూడా కొత్త ప్రాజెక్టు‌ రావడంతో హర్షకి పని వత్తిడి ఎక్కువైంది. ఇంట్లో నాన్నగారికి కూడా బాగు లేక పోవడంతో హర్షకి ఊపిరి సలషడం లేదు. అప్పటికీ కమలమ్మ తండ్రి గురించి ఆలోచించ వద్దని, తాను దగ్గరుండి చూసుకుంటానని చెప్పి ఆఫీసుకు శెలవు కూడా పెట్ట నీయలేదు. అయినా హర్ష తండ్రి ని గురించిన ఆలోచనలతో పని మీద శ్రద్ద పెట్ట లేక పోతున్నాడు.

హర్ష ఫ్రెష్ అయి వచ్చాక ఇద్దరూ భోజనం చేసారు. మరునాడు శనివారం, ఆఫీస్ లేదు కనుక లేట్ గా లేస్తానని చెప్పి హర్ష పడుకున్నాడు.

మరునాడు ఉదయం భర్తకు, తనకు కాఫీ కలిపి తాగుతూ ఉండగా రామారావు గారు "కమలా, బాబు రావడం బాగా ఆలస్యం అయిందా." అని అడిగారు.

" బాబు వచ్చేసరికి 9 గంటలు దాటింది. వాడు రాగానే మిమ్మల్నే అడిగాడు. ఇవాళ శనివారం కదా, లేటుగా లేస్తాడు." అని కమలమ్మ అంటూండగానే హర్ష వచ్చాడు.

"అదేంటి బాబూ, అప్పుడే లేచావ్. ఆలస్యంగా లేస్తావని అమ్మ ఇప్పుడే అంది." అన్నారు రామారావు గారు ఆశ్చర్యంగా.

"నిద్ర పట్టలేదు నాన్నగారు. మీకెలా ఉంది?" అడిగాడు హర్ష, తండ్రి పక్కనే కూర్చుని తల్లి తెచ్చిన కాఫీ అందుకుంటూ.

" నేను బాగానే ఉన్నాను బాబూ. నువ్వేమిటలా ఉన్నావ్. వర్క్ ప్రెజర్ ఎక్కువగా ఉందా?" అడిగారు రామారావు గారు కొడుకు చేతిని ప్రేమగా నిమురుతూ.

"అది మామూలే నాన్నగారు." అన్నాడు హర్ష.

"మరి ఎందుకలా ఉన్నావ్?" కమలమ్మ అడిగింది కొంచెం ఆందోళన గా.

"ఏముందమ్మా. ఆఫీస్ వాళ్ళకి వాళ్ళ పని తప్ప, మన ఇబ్బందులు పట్టవు. ఇంట్లో పరిస్థితులు ఎలా ఉన్నా వాళ్ళ పని ఏమాత్రం వెనక బడకూడదు." విసుగ్గా అన్నాడు హర్ష.

"అదేంటి, మీ బాస్ చాలా మంచి వాడు, నువ్వంటే చాలా ఇష్టం అని చెప్పావు." అడిగింది కమలమ్మ.

"మనం పని చేసినంత వరకే బాస్ ఇష్ట పడేది. ఏమన్నా తేడా వేస్తే ఇష్టం ఇగిరి పోతుంది." అన్నాడు హర్ష చిన్న బుచ్చుకొని.

"ఈమధ్య పనిలో ఏమైనా అశ్రద్ధ చేసావా బాబూ." తండ్రి ప్రశ్నించారు.

" నాన్నగారూ, ఈమధ్య మీకు ఒంట్లో బాగు లేక కాస్త పని మీద శ్రద్ద పెట్ట లేక పోయాను. ఆ మాత్రానికే మా బాస్ నన్ను పిలిచి వార్నింగ్ ఇచ్చారు. ఆయనకీ నా పరిస్థితి తెలుసు, అయినా సరే..." ముఖం గంటు పెట్టు కొని అన్నాడు హర్ష.

రామారావు గారు కమలమ్మ వైపు చూసి చిన్నగా నవ్వారు. తర్వాత హర్షతో "చూడు బాబూ, ఆఫీస్ లో బాస్ నిన్ను చూసి కాదు, నీ పనిని చూసి ఇష్టపడుతాడు. వ్యక్తిగతంగా నీపై అభిమానం ఉందని, పనిని అశ్రద్ధ చేస్తే వార్నింగ్ ఇవ్వకుండా ఉంటాడా. అతని పై వాళ్ళకి అతనూ సమాధానం చెప్పుకోవాలి కదా." అన్నారు.

"హర్షా, ఆఫీస్ లో సమస్యలు ఇంటికి తీసుకు రాకూడదు. అలాగే ఇంటి సమస్యలు ఆఫీస్ కి. పనిలో ఎప్పుడూ అశ్రద్ధ చేయ కూడదు. ఇది ఇంకా చిన్న సమస్య. రేపు నీకు సంసారం ఏర్పడితే సమస్యలు కూడా పెరుగుతాయి. ఇప్పుడే ఇలా అంటే ఎలా." కమలమ్మ నచ్చ చెపుతున్నట్లుగా అంది.

"అమ్మా, నేను నాన్నగారికి బాగా లేదని కదా డిస్టర్బ్ అయ్యాను." అన్నాడు హర్ష.

" చూడు బాబూ, ఇంట్లో సమస్యలకు, ఆఫీస్ పనికి లంకె పెట్ట కూడదు. మీ బాస్ నీకు వార్నింగ్ ఇచ్చారు అంటే నువ్వు పనిలో వెనుక పడి చెడ్డ పేరు తెచ్చుకో కూడదని. చేరిన కొద్ది కాలంలోనే మంచి పేరు తెచ్చుకున్నావు." రామారావు గారు నచ్చ చెప్పారు.

"నీకు గుర్తుందా. చిన్నప్పుడు నీకు జ్వరం వచ్చి ఒక రోజు స్కూల్ కి వెళ్ళక పోయినా మర్నాడు టెస్ట్ సరిగా రాయలేదు అని టీచర్ నీకు పనిష్మెంట్ ఇచ్చారు. అప్పుడు నీకేం చెప్పాను, నీ పాఠాలు నువ్వు ఏరోజు కారోజు అప్డేట్ లో ఉంటే ఏ ఇబ్బందీ ఉండదు అని. ఇప్పుడూ‌అంతే. ప్రతి చిన్న సమస్య కి భయ పడకూడదు." కమలమ్మ గారు హర్షకి చిన్నతనం గుర్తు చేశారు.

"అమ్మా, నాన్నగారూ, ఈ రోజు మీ దగ్గర నేను చాలా విషయాలు నేర్చుకున్నాను. ఇంకెప్పుడూ, ఎటువంటి సమస్యలు ఎదురైనా పనిని అశ్రద్ధ చేయను." అన్నాడు ధృడంగా.

"అంతేకాదు హర్షా, ఈ బాస్ మంచి వారు అన్నావు. అతని దగ్గర సాధ్యమైనంత వరకు పని నేర్చుకోవాలని చూడు. ఎందుకంటే ఎప్పుడూ ఈయనే ఉంటారని చెప్పలేం కదా. ఆయన ఉన్నంత కాలం నువ్వు ఎదగడానికి దోహదపడే ఏ అవకాశం చేయి జార్చుకోకు." అన్నారు రామారావు గారు.

"అలాగే నాన్నగారూ. మీరన్నది పాటిస్తాను." అన్నాడు హర్ష.

"అవును బాబూ, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టు కోవాలి కదా మరి." అంది కమలమ్మ నవ్వుతూ. ఆమె నవ్వుతో తండ్రీ కొడుకులు జత కలిపారు.



Rate this content
Log in

Similar telugu story from Abstract