"పున్నమి లేని చంద్రుడు’’ (కధ)
"పున్నమి లేని చంద్రుడు’’ (కధ)
‘’పున్నమి లేని చంద్రుడు’’ (కధ)
ఆశీర్వాదం లోపలికి వస్తూ ‘’ నమస్తే గురువుగారు!’’ అన్నాడు
‘’రావోయ్ రా!’’ అంటూ ఆహ్వానించాను.
‘’ మీతో చెప్పానే. వీడే నా మేనల్లుడు. ఖమ్మం జిల్లాలో ఓ మారుమూల పల్లెలో ఒక బీద కుటుంబం. మా బావ పొలంలో పని చేస్తూ ఉండగా పాముకాటుతో చనిపోయాడు. మా అక్కని, పిల్లలిద్దర్నీ పువ్వుల్లోపెట్టి చూసుకునేవాడు. పెద్దది అమ్మాయి. అతను ఉండగానే పెళ్లి చేసేసాడు . అల్లుడు కూడా చాలా మంచివాడు. తర్వాత వీడు. వీడికి బాగా చదువు అబ్బలేదు. పదవ తరగతి లెక్కల పరీక్ష ఉండిపోయింది. నాకు మన సర్కిల్లో మీరు గుర్తు వచ్చారు. మీ దగ్గర అనుమతి తీసుకున్నాకనే వాడిని రమ్మని ఫోన్ చేశాను. వాడి పేరు ఏకాంబరం.’’ అంటూ నాకు తనతో తీసుకువచ్చిన పిల్లవాడిని పరిచయం చేశాడు.
17 ఏళ్ళు ఉంటాయి ఆ అబ్బాయికి. కాయకష్టం తో పెరిగిన శరీరంలా, గట్టిగా నిట్రాడులా ఉన్నాడు. పచ్చని పసిమి. జీన్స్ ప్యాంటు, ఎరుపు రంగు టీ షర్ట్ వేసుకున్నాడు.
రెండు చేతులు జోడించి నమస్కరించబోయి, వంగి నా పాదాలను స్పృశించాడు.
‘’సరే నాన్నా! నీ పేరు?’’ అడిగాను ఆశీర్వాదాన్ని పరిశీలిస్తూనే.
‘’ ఏకాంబరేశ్వరరావు సార్!’’ అన్నాడు వినయంగా చేతులు కట్టుకుని.
‘’గుడ్.లెక్కల్లో ఎన్ని మార్కులు వచ్చాయి?’’
‘’ 34 మార్కులు వచ్చి పరీక్ష పోయింది సార్.’’
‘’ఏ ఎదవ దిద్దాడో గాని ఆ ఒక్క మార్కు వేసి ఉంటే పరీక్ష పాస్ అయి, ఈ పాటికి కాలేజీలో చేరి ఉండేవాడు గురువుగారు. మనమే మేట్టర్లే మనకి ఉపయోగపడరు సార్’’ అన్నాడు ఆశీర్వాదం. అక్కడ అతనికి కొంత వివరణ ఇవ్వడం అవసరం అనిపించింది.
‘’బాబూ. నువు కూర్చుని నీకు వచ్చిన అయిదు లెక్కలు ఎక్కించుకొని నీకు వచ్చినట్టు జవాబులు రాయి. నేను మావయ్యతో మాట్లాడుతూ ఉంటాను’’ అని ఏకాంబరంతో చెప్పి, తోటి ఉపాధ్యాయుల పట్ల అతనికి ఎంత గౌరవం ఉందో గ్రహించిన నేను వీధిలోకి వచ్చాను. విధి లేక నా వెనకనే అనుసరించాడు ఆశీర్వాదం.
‘’ఆ బాబు జవాబు పత్రాలు దిద్దిన ఉపాధ్యాయులు ఎవరో నీకు తెలుసా?’’ అడిగాను.
‘’తెలవదు సార్.’’
‘’మరి ఎదవ అని ఏదో అంటున్నావ్? మన తోటి ఉపాధ్యాయులని మనమే గౌరవించుకోకపోతే వేరే ఎవరో మనని ఎలా గౌరవిస్తారు చెప్పు?’’ ఆ మాట అన్న తీరుకి కాబోలు ఒక్క క్షణం తప్పు చేసిన వాడిలా తలదించుకుని అంతలోనే తలకాయ తల ఎగరేశాడు ఆశీర్వాదం. అతని తత్వం నాకు తెలుసు. ‘అందితే జుట్టు -అందకపోతే కాళ్లు’ అనే పద్ధతి. రెండు సందర్భాలలో అతని గురించి నేను అర్థం చేసుకున్నది అదే.
‘’పదవ తరగతి పబ్లిక్ పరీక్షలలో నీకు వాల్యుయేషన్ ఎలా చేస్తారో తెలుసా?’’
‘’తెలీదు గురువు గారు.’’
‘’విషయం తెలియకుండా అవతలివారిని నిందించడం వలన రెండు నష్టాలు జరుగుతాయి అని నాకు నమ్మకం. నీకు పాపభీతి అంటే తెలుసా?’’
‘’అయ్యో! ఎందుకు తెలియదు సార్! అందుకేగా ఏదైనా పాపం చేశానని అనిపిస్తే వెంటనే ప్రార్థన చేసుకుంటాను.’’
‘’గుడ్ అనవసరంగా ఇతరులను నిందిస్తే పాపం అంటుకుంటుంది. రెండవది అవతలి వ్యక్తి గురించి మనం తెలుసుకోకుండా మాట్లాడిన తొందరపాటుదనానికి మనమంటే ఎదుటివారికి చులకన భావం ఏర్పడుతుంది.
పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కాబోయే ముందే ఏ సబ్జెక్ట్ పేపరు ఈ జిల్లాకు పంపించాలో పరీక్షలు నిర్వహించే అధికారులకు సూచనలు అందుతాయి. అలా గణితం ఒకటో జవాబుపత్రాలు ఒక జిల్లాకు, గణితం రెండవ జవాబుపత్రాలు మరో జిల్లాకు చేరతాయి. పరీక్షలు పూర్తయ్యాక వాల్యుయేషన్ మొదలవుతుంది.
జవాబు పత్రాలు దిద్దాకా ఆయా జిల్లాకేంద్రాల నుంచి మార్కులు మాత్రమే హైదరాబాద్ చేరతాయి. ఒకటవ పేపర్లో 18 మార్కులు వచ్చి, రెండవ పేపర్ లో 16 మార్కులు వస్తే మొత్తం నూటికి ముప్పై నాలుగు మార్కులు వస్తాయి. దాంతో ఆ సబ్జెక్ట్ లో విద్యార్థి ఫెయిల్ అయినట్లు నిర్ధారణ అవుతుంది. విద్యార్థి రాసిన దానికి మాత్రమే మార్కులు వేయడం జరుగుతుంది కానీ, రాయని జవాబుకు మార్కులు వేయరు కదా . పేపర్ వన్ దిద్దే ఉపాధ్యాయుడిది ఒక జిల్లా. పేపర్ టు దిద్దే ఉపాధ్యాయునిది ఇది మరొక జిల్లా . మరి 34 వేశాడని ఆ ఉపాధ్యాయులను తిట్టుకుని ఏం లాభం? అందుకే ఏ ఉపాధ్యాయుడు జవాబు పత్రాలు దిద్దినా కనీసం యాభైకి 20మార్కులు వచ్చేలా రాయమని నా విద్యార్థులకు సూచనలు ఇస్తూ ఉంటాను. మనలో సరుకు లేకుండా, మార్కులు వేయలేదని ఉపాధ్యాయుల్ని నిందించడం మంచిది కాదు. మనల్ని మనమే గౌరవించుకోకపోతే నీ మాటలు విన్న కుర్రాళ్ళు మనల్ని ఎలా గౌరవిస్తారు చెప్పు ?’’ అన్నాను.
‘’సారీ సార్. మరి వాడిని మీ చేతిలో పెట్టాను. ఇక మీదే బాధ్యత’’ అనేసి వెళ్ళిపోయాడు ఆశీర్వాదం. నేను లోపలికి వచ్చి ఏకాంబరం దగ్గర కుర్చీలో కూలబడ్డాను.
అప్పటికే అతను తనకు నచ్చిన ఐదు సమస్యలను నోట్ బుక్ లో ఎక్కించి చేసి ఉంచాడు. నాకు అర్థమైంది ఏమిటంటే అతనికి మౌలిక భావనలు, ప్రాథమిక అంశాలు తెలియదు.
లెక్క చేయడంలో కొన్ని కొండగుర్తులు వేసుకుని పెట్టుకొని స్టెప్స్ వేస్తున్నాడు. అయితే ఒక సోపానం కరెక్ట్ అయితే మరో సోపానం తప్పు.
దాంతో నాలుగు మార్కుల సమస్యకు ఒకటి లేదా ఒకటిన్నర మార్కులు మాత్రమే వస్తున్నాయి. దాంతో పరీక్ష తప్పాడు.
నేను ఒక అధ్యాయం మొదలుపెట్టి ప్రాథమిక అంశాలను ఉదాహరణలతో సహా వివరించాను. ఒక సమస్య తీసుకుని అందులో ఏ ఏ ప్రాథమిక అంశాలు ఉపయోగించాలో ప్రశ్నల ద్వారా రాబట్టాను. అనంతరం అలాంటి సమస్య మరొకటి ఇచ్చి చేయమన్నాను.
అతను నేను అనుకున్న విధంగా చేసి చూపించాడు. ‘వెరీగుడ్’అని మెచ్చుకుని మరొక మోడల్ చెప్పాను. దానిని సరిగ్గా చేసి చూపించాడు. ఈసారి ‘వెరీ గుడ్’ అని నోట్స్ లో రాశాను.
అతని ముఖంలో నాపట్ల ఏదో పవిత్ర భావం, కళ్ళల్లో అద్భుతమైన మెరుపు మెరిసి మాయమయ్యాయి.
‘’మీకు నేరం చెబుతున్నాను అనుకోకపోతే ఒక మాట సార్’’ అన్నాడు ఏకాంబరం ‘’ఏమిటో చెప్పయ్యా’’ అన్నాను చిరునవ్వుతో.
‘’మా లెక్కల సారు ఇలా ఏనాడు ఒక్క లెక్క కూడా చెప్పలేదు సార్. ఇలా బోర్డు మీద చేసేసి అలా చెరిపేస్తారు సార్. అందుచేత ఆయన వ్రాయటం మొదలు పెట్టిన వెంటనే లెక్కలు ఎక్కించుకోవడం మొదలుపెడతాం. దాంతో ఆయన రాస్తూ చెప్పేది మాకు అర్థమయ్యేది కాదు. లెక్క ఎక్కించక పోతే నోట్స్ రాయలేదేం అని చితకబాదేస్తారు సార్.’’
‘’చూడు నాన్న. ఒక్కొక్కరు ఒక్కొక్క ఒక పద్ధతిని అనుసరించి బోధిస్తూ ఉంటారు వారిని విమర్శించే హక్కు మనకి ఎక్కడిది చెప్పు?’’ అన్నాను. నిజానికి ఈ విమర్శ నేను ఎంతో మంది గణిత ఉపాధ్యాయుల గురించి విన్నాను.
‘’మరో మాట సార్!’’
‘’చెప్పయ్యా”
‘’ఏరా, పోరా, ఎదవా.. ఇంకా కోపం వస్తే పచ్చి బూతులు కూడా తిట్టేవారు సార్. విద్యార్థికి మీరిచ్చే గౌరవం చూస్తుంటే మీ శిష్యుడిని ఎందుకు కాలేకపోయానా అని బాధ పడుతున్నాను సర్.’’
‘’చూడు బాబు. అవన్నీ నీ మంచికి అనుకోగలిగావు కాబట్టి 5 సబ్జెక్టులు పాస్ అయ్యావు. ఆ సార్ సంగతి మర్చిపోయి నేను చెప్పేది శ్రద్ధగా చదువు. విద్యార్థికి ఉండవలసిన మౌలిక లక్ష్యం - చదువుకునే అంశం పట్ల అభిరుచి కలిగి ఉండడం, ఎక్కడ అనుమానం వచ్చినా అడిగి తెలుసుకుని సందేహం నివృత్తి చేసుకోవడం. ఈవేళ నువ్వు నేర్చుకున్నవన్నీ నాకు రేపు చూడకుండా చేసి చూపించాలి సరేనా?’’
‘’సరే సార్!’’
“ఇవాల్టికి చాల్లే!’’ అని పంపించేసాను.
*******
మర్నాడు వస్తూనే క్రితం రోజు నేను చెప్పిన సమస్యలన్నీ కాయితం మీద ఎక్కించుకుని పరీక్ష రాశాడు ఏకాంబరం. 25 మార్కులు కి ఇరవై మూడున్నర మార్కులు వచ్చాయి. ఇటువంటి విద్యార్థుల స్థాయికి దిగి ఉపాధ్యాయుడు బోధిస్తే ఉత్తీర్ణత ఫలితాలు బాగుంటాయి కదా! అనుకున్నాను.
యధాలాపంగా నేను పేజీలు తిప్పుతుంటే మొదటి పేజీలో తన పేరు కింద వ్రాసుకున్న వాక్యాలు నన్ను ఆకర్షించాయి. ఆంగ్లంలో ఉన్నాయి అవి.
‘’ My moto is not only pass the examination. I try to attain atleast sixty percent. ‘’
మౌనంగా దానికింద ‘’If you work hard, You will succeed.’’ అని వ్రాసి సంతకం చేశాను.
ఒక రెండు గంటల పాటు తీక్షణంగా చదువు చెప్పాక అతని వివరాలు తెలుసుకోవాలి అనిపించింది.
‘’ నీకు అభ్యంతరం లేకపోతే ఒక విషయం అడగనా?’’
‘’అడగండి సార్!’’
‘’మీ కుటుంబం గురించి చెప్పు.’’
“నేను మీకు ఎవరి గురించి అయినా నేరం చెబితే నచ్చదేమో కదా సార్!’’
‘’ నేను నేరాలు అడగడం లేదు. ఉన్న విషయం ఉన్నట్లు చెప్పు. నువ్వేమిటో, నీ పరిస్థితి ఏమిటో నాకు పూర్తిగా అర్థం అయితే నీకు అవగాహన అయ్యే కష్టమైన అధ్యాయాలు కూడా చెప్పాలన్నది నా ఉద్దేశం.’’
‘’సార్. మా ఇంట్లో అమ్మ, అమ్మమ్మ, నేను ఉంటాం సార్. అందరమూ కూలి పనికి వెళ్తామ్. అక్కకి పెళ్ళి చేశారు సార్. అక్క పెళ్లి అయ్యాక నాన్న పొలం పని చేస్తూ ఉండగా పాము కాటు వేసి చనిపోయాడు. అమ్మ, అమ్మమ్మ, నేను అందరమూ కూలిపని చేసి అటు కుటుంబం జరుపుకుంటూ, ఇటు కొంత డబ్బు దాచి మగపిల్లవాడు అని మావయ్యని బాగా చదివించారు. ఆడపిల్లను కూడా చదివించండి అని నాన్న ఎప్పుడు మొత్తుకుండేవాడు సార్! ‘ఆడపిల్లలకు చదువు ఎందుకయ్యా? పెళ్లి చేస్తే ఇంట్లో పడి ఉంటాది’ అని అమ్మమ్మ నాన్న నోరు మూయించేది.
అమ్మకు అమ్మమ్మ చెప్పిందే వేదం. ఆ అలుసు చూసుకుని మావయ్య చెలరేగిపోయెవాడు. రెక్కలు ముక్కలు చేసుకుని మావయ్యని ఎం.ఎస్.సి.చదివించారు. తర్వాత రెండేళ్లు ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేశాడు. అతను చాలా బాగా చదువుతున్నాడు అనుకుని డబ్బు ఎలాగోలా తెచ్చి పంపించేవారు.
మా ఇంట్లో ఎవరికీ పెద్ద చదువులు రావని, ఊర్లో రాఘవయ్య మాష్టారిని పట్నం వెళ్లి వాడిని చూసి రమ్మని పంపారు. ఆయన వెళ్లి చూసి వచ్చి మావయ్య బండారం బయటపెట్టారు.
మావయ్య ఆయనను కేకలేసి వెంటనే బి.ఈ.డి. లో చేర్పించారు. ఉద్యోగం రాకుండానే దొమ్మరి కాలనీలో డిగ్రీ చదువుతున్న కిరణ్మయిని ప్రేమించాడు. ఉద్యోగం రాగానే పెళ్లి చేసేసుకున్నాడు.
‘’నీ చదువుకు అయిన అప్పు తీర్చరా’’ అంటుంది అమ్మమ్మ.
‘’పెళ్ళాం సరదాలు తీర్చడానికి కాకపోతే పెళ్లి ఎందుకు చేసుకున్నావ్?’’ అని అత్త. వీరిద్దరి మధ్య లో మావయ్య నాటకాలాడేసేవాడు.
జీతంలో కొంత అప్పు తీర్చేలా ఏర్పాటు చేశారు రాఘవయ్య మాస్టారు.
‘’నన్ను నీ దగ్గరికి తీసుకుపో. నన్ను కడదాకా చూస్తానన్న మీ బావ నోరు నొక్కి, మీ అక్కని ఒప్పించి నిన్ను చదివించాను. కొడుకు ఉండగా తల్లిని కూతురు చూడటమేమిట్రా.’’ అంది అమ్మమ్మ.
‘’మీ అమ్మ నా దగ్గర ఉంటే ఉరి పోసుకుని చస్తానని అత్త బెదిరింపు’’
‘’మగ పిల్లవాడు చదువుకొని ఉద్ధరిస్తాడు అనుకున్న నాలాంటి చాదస్తపు చదువురాని మొద్దులకి ఈశాస్తి జరగాల్సిందే. అదేనిన్ను చదివించి ఉంటే, నువ్వు, నీ బిడ్డలు, నీ కుటుంబం కూడా బాగు పడేవారే. నీకు చదువు చెప్పించకుండా ఉసురుపెట్టినందుకు నాకు తగిన శాస్తి జరిగింది’’ అని అమ్మమ్మ అమ్మను చూసి ఏడుస్తూ ఉంటుంది.
‘’కన్నందుకు ఎవరికోసం చదువు చెప్పిస్తారు?ఆయన కష్టపడి చదువుకుని ఉద్యోగం సంపాదించాడు. అందుకేగా మా బతుకు మేము బతుకుతున్నాం’’ అంటుంది అత్త.
మావయ్య కు ఉద్యోగం వచ్చి నాలుగేళ్లయింది. అప్పు పాతిక వంతు కూడా తీరకపోవడంతో నేను కూడా మూడేళ్ల నుంచి సీజన్లో కోతలకు వెళ్ళేవాడిని సార్. సెలవులప్పుడు కూలీ గా పని చేసేవాడిని సార్. ఆ డబ్బులు అమ్మకు ఇస్తాను సార్. ఇది సార్, నేను,మా కుటుంబం కథ!’’
‘’మరి మీ అమ్మమ్మగారికి మావయ్య డబ్బులు ఏమీ ఇవ్వడా?’’అడిగాను.
‘’ఇంకా బాగా ఓపికాగానే ఉన్నావుగా. పని లోకి వెళ్ళి సంపాదించుకుని తిను.’’ అంటాడు మామయ్య. ఆ విషయంలోనే మావయ్య అంటే కోపం వస్తుంది సార్ నాకు. అమ్మ ఎంతో బతిమాలిన మీదట నాకు మీతో లెక్కలు చెప్పించడానికి ఒప్పుకున్నాడు సార్.’’
నా హృదయం జాలితో నిండిపోయింది.
‘’చూడు నాన్నా. నువు ఎక్కువ సేపు ఉండగలిగితే మరో గంట ఎక్కువసేపు చెబుతాను . నువ్వు రాగలిగితే రెండో పూట కూడా చెప్తాను. అలా అయితే తప్ప కోర్సు పూర్తి కాదు మరి!’’ అన్నాను.
ఏకాంబరం మరింత సంబరంగా చూశాడు.
‘’తప్పకుండా వస్తాను సార్!’’ అన్నాడు ఉత్సాహంగా.
*******
‘’సార్. మరో ఐదు రోజులలో కోర్సు పూర్తి అయిపోతుందా సార్?’’ ఏకాంబరం అడిగాడు
అప్పటికి అరవై శాతం పూర్తి చేశాను.
‘’ఏం? ఎందుకని?’’ అడిగాను
‘’పరీక్షలు ప్రారంభం అయితే హాల్ టికెట్ ఇవ్వరట సార్. అందుకని ప్రారంభం కాకుండానే వచ్చేయమని అమ్మ ఫోన్ చేసింది.’’
‘’అదేమీ ఉండదే. ఈ రోజు పరీక్ష అనగా కూడా ఉదయం వెళ్లి హాల్ టికెట్ తీసుకుని పరీక్ష రాయవచ్చు’’ అన్నాను.
‘’అలా కుదరదు అని చెప్పారట సార్’’
చదువుకోక పోవడమే ఈ పల్లెవాసులకు శాపమా?
విషయ అవగాహన, అందులో విషయ పరిజ్ఞానం లేని ప్రజలకు మన చేతుల్లో ఉండే సాయం కూడా చేయలేక పోవడం దారుణం. మంట కలిసి పోతున్న మానవతా విలువలకు ఇంతకన్నా ఉదాహరణ ఏం కావాలి? అనిపించింది నాకు.
‘’ఇంతకీ ఏమంటావు?’’
‘’అందుకని పరీక్షలు ప్రారంభం అయ్యే ముందు రోజుకే అక్కడికి చేరుకోవాలి సర్. మీరు దయచేసి మరో గంట చెబితే?’’ నేను నవ్వేశాను
‘’దానికి అంత భయం ఎందుకు? తప్పకుండా చెబుతాలే’’ అన్నాను.
అలా అడిగిన ఏకాంబరం ఆ సాయంత్రమే ప్రైవేట్ కి రాలేదు.
మరుసటి రోజు ఉదయం మొహం వేలాడేసుకుని వచ్చాడు.
''నిన్న రాలేదేమి ? ఎన్ని ప్రాబ్లమ్స్ కవరయ్యేవో తెలుసా?'' అన్నాను కొంచం విసుగ్గా.
'' అది కాదు సార్. నిన్న సాయంత్రం కడుపునొప్పి వచ్చింది. అందుకే రాలేదు. సారీ సార్'' అన్నాడు అపరాధ భావంతో.
''సరేలే. లెక్కలు మొదలుపెట్టు'' అన్నాను.
లెక్కలు చెబుతున్నంత సేపు ఎడమ చేతి వైపు పొట్ట మీద సన్నగా బొటనవేలితో రాసుకుంటూనే ఉన్నాడు.
''ఏంనాన్నా. బాగా నొప్పిగా ఉందా? డాక్టర్ దగ్గరికి వెళ్దామా?'' అడిగాను.
''నో సార్. అవసరం లేదు. మీరు చెప్పండి'' అంటూ చదువులో నిమగ్నమయ్యాడు.
నాకు ఏదో దాస్తున్నట్టే అనిపించింది. అయినా ఇంటికి వెళ్తే ఆశీర్వాదం చూసుకుంటాడులే అని సర్దుకున్నాను. చివరి 5 రోజుల్లో నాలుగు పూటలు కడుపునొప్పితో ఏకాంబరం రానేలేదు.
చివరి రోజు వచ్చి ''ఈ సాయంత్రమే వెడుతున్నాను సార్!'' అని చెప్పాడు. అప్పటికి 75 శాతం కోర్సు మాత్రమే పూర్తి చేశాను.
'' పరీక్ష పాస్ అవుతావా?'' అడిగాను.
''60 మార్కులు తక్కువ కాకుండా తెచ్చుకుంటా సార్'' అతని కంఠంలో ఎంతో ఆత్మవిశ్వాసం ధ్వనించింది నాకు.
''నిన్ను ప్రైవేటులో చేర్చాకా మళ్లీ మీ మావయ్య కనిపించనే లేదు. ఒకసారి కనబడమని చెప్పు'' సంతృప్తి నిండిన కళ్ళతో చూస్తూ అన్నాను.
''సార్! మిమ్మల్ని ఒకటి అడిగి, మీతో ఒకటి చెప్పవచ్చునా?'' అడిగాడు తటపటాయిస్తూ.
''పర్వాలేదు. ధైర్యంగా చెప్పు''అన్నాను వెన్ను తడుతూ.
''మళ్ళీ జన్మంటూ ఉంటే మీకు కొడుకుగా పుట్టాలని ఉంది సార్. ఇదే నేను చెప్పదలుచుకున్నది. ఇక రెండోది మీ పాదాలకు నమస్కరించుకోవచ్చునా?'' అన్నాడు వణుకుతున్న కంఠంతో.
వయసు ప్రభావమో,వినయవిధేయతలతో నేను చెప్పిన నాలుగు ముక్కలు నేర్చుకున్నాడన్న అభిమానమో, నా కళ్ళు చమర్చాయి. పాదాల మీద పడి రెండు నిమిషాలు అలాగే ఉండిపోయాడు. అతని వెచ్చని కన్నీళ్ళు నా పాదాలను అభిషేకించాయి.
నా మనసు ఆర్ద్రమైంది.
ఉపాధ్యాయుడు ఒక చెట్టు లాంటి వాడు. ఆ నీడలోకి ఎంతో మంది వస్తుంటారు, సేదతీరి పోతుంటారు. కొంతమంది చెట్టు ఎక్కుతారు. దానితో అభిమానం పెంచుకుని ఆటలాడతారు. ఇంకా ముందుకు వెళ్లి దానికి పువ్వులు ఫలాలు అందుకుంటారు.
కేవలం పద్ధెనిమిది రోజుల్లోనే నా మనసు ఫలాన్ని అందుకున్నాడు ఏకాంబరం.
''లే నాన్న. నీకు మంచి భవిష్యత్తు ఉంటుంది. పూర్తిగా చదువుకు సమయం కేటాయించాల్సిన వయసులోనే బాధ్యతను అర్థం చేసుకుని పంచుకున్న మనసు నీది. నీకు ఎప్పుడూ శుభం జరుగుతుంది. బెస్ట్ ఆఫ్ లక్'' అని ఏకాంబరాన్ని లేవనెత్తాను.
''నాన్నా. నా పిల్లలు ఇద్దరు పెళ్లిళ్లు చేసుకుని మంచి మంచి ఉద్యోగాలు చేసుకుంటూ సుఖంగా కాపురాలు చేసుకుంటున్నారు. ఇంకా నాకు అయిదేళ్ళ సర్వీస్ ఉంది. నాకు నీ లాంటి విద్యార్థులే మానసిక బలం.అందుకే ఇది నీకు నా బహుమతి'' అంటూ అతన్ని పుత్రప్రేమతో కౌగలించుకుని నుదుట ముద్దాడాను.
''మాష్టారుగారు. మా కులం...'' ఏకాంబరం ఏదో అనబోయాడు.
''మనం లోకులం నాన్న. ఈ బహుమతి నన్ను నీకు గుర్తు చేసి నువ్వు పరీక్ష పాస్ అయేలా చేయాలి... చేస్తుంది కూడా. ఆరోగ్యం జాగ్రత్త! బై. వెళ్లి రా!''
ఏకాంబరం మనసు తేలిపోతుంన్నంత ఆనందంతో వెళ్ళిపోయాడు - వెళ్లలేక వెళ్లలేక.
సుమారు ఆరు నెలల అనంతరం ఆశీర్వాదం హఠాత్తుగా ఊడి పడ్డాడు.
సైకిల్ దిగుతూనే నా చేతులు పట్టుకొని బావురుమన్నాడు.
'' గురువుగారు అంతా మా దురదృష్టం...నా తలరాత ...''అంటూ.
'' అరే ఏమైందయ్యా?'' అడిగాను.
''మావాడు... అదే ...మీరు లెక్కలు చెప్పిన మీ శిష్యుడు ఇక లేడండి. పోయాడట. అంతా మా దురదృష్టం.''
నేను నిలువునా కొయ్యబారిపోయాను.
''ఎలా.... ఎలాగయ్యా?'' ఆత్రుతగా అడిగాను.
'' 24 గంటల నొప్పి వాడి ప్రాణం తీసింది సార్. '' నాకు ఆరోజు ఏకాంబరం బాధపడటం గుర్తొచ్చింది.
అంటే అప్పటికే తరచుగా వస్తూ ఉండేది అన్నమాట. ఎంత పని చేశాను? ఆశీర్వాదం చూసుకుంటాడు అనుకున్నాను. ఆ రోజు నేనే డాక్టర్ దగ్గరికి తీసుకు వెళ్లాల్సింది.
'' రాత్రి లోగా ఖమ్మం చేరాలి. ఓ వెయ్యి రూపాయలు డబ్బులు అప్పుగా ఇప్పించండి సార్. వచ్చాక ఇస్తాను'' అన్నాడు ఆదుర్దాగా.
అప్రయత్నంగా తీసి ఇచ్చాను.
నా చెవిలో చివరి రోజు ఏకాంబరం నాతో అన్న మాటలు ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి.
'' మళ్ళీ జన్మలో మీ కొడుకు గా పుట్టాలని ఉంది సార్!''
******
ఆశీర్వాదం ఊరు వెళ్లిన మర్నాడే నాకు ఒక కవరు అందింది.
అందులో 500 రూపాయల నోటు తో పాటు ఓ ఉత్తరం కూడా ఉంది. విప్పి చదువసాగాను.
''గురుదేవులకు - ఏకాంబరం నమస్కరించి వ్రాయునది.
పరీక్ష పాస్ అయ్యానన్న విషయం మావయ్య మీతో చెప్పి ఉంటాడు సార్. నాకు 69 మార్కులు వచ్చాయి. ఇది ఇది మీరు పెట్టిన బిక్ష. ఎందుకంటే మీకు ఇమ్మని అమ్మ ఇచ్చిన ఫీజు మావయ్య మీకు ఇవ్వలేదు. నేను ఆందుకు బాధ పడలేడు. అతని తత్వం నాకు తెలుసు కాబట్టి.
'ఆ లెక్కల మాస్టారు చాలా డబ్బు మనిషి . వెయ్యి రూపాయలు ఇస్తే తప్ప చదువు చెప్పడు. చెబితే మాత్రం పిల్లాడు పాస్ కావాల్సిందే' అని నన్ను అక్కడికి తీసుకు వచ్చిననాడే ఫీజు, నా దారి ఖర్చులు, నన్ను వారి ఇంట్లో ఉంచుకున్నందుకు నెల రోజులకు మొత్తం 2500 తీసుకున్నాడు.
మీకు ఆ డబ్బులు ఇవ్వలేదని నాకు అర్థమైంది. ఆ డబ్బు ఇప్పుడు మీకు పంపుతున్నాను. గురుదక్షిణ లేని చదువు అంటదని రాఘవయ్య మాస్టారు చెప్పేవారు.
ఉపాధ్యాయ కులంలో అలాంటి వేరుపురుగులు చేరి చదువు అనే చెట్టును చెరిచివేస్తూ ఉంటే ఎందుకొ బాధగా ఉంది సార్.
బాధ అంటే గుర్తుకొచ్చింది సార్. నాకు కడుపులో వచ్చే నొప్పి మామూలు నొప్పి కాదని, అది 24 గంటలనొప్పి అని సంవత్సరం క్రితమే నాకు తెలుసు సార్. జీవశాస్త్రం పాఠం లో చదివాను సర్. నేనే ఎవరికీ చెప్పలేదు. నేను నొప్పితో బాధపడుతుంటే అమ్మమ్మ ఆ ప్రదేశంలో ఆముదం వేడిచేసి మర్దన చేసేది. అయినా తగ్గలేదు.
మాలాంటి పేద కుటుంబాలలో రోగాలు రాకూడదు సర్. వస్తే కుటుంబం మరింత అప్పులపాలు అవుతుంది. అందుకే నేను పోతే, నాన్న అప్పు చేసి చదివించాల్సిన అవసరం ఉండదు. అందుకే మీరు అడిగినా నేను చెప్పలేదు సార్. రేపు మా వాళ్ళు కష్టపడి అప్పులు చేసి నన్ను చదివించిన తర్వాత, రేపు నాకు భార్యగా వచ్చే వ్యక్తి కూడా అత్తలాగే ప్రవర్తిస్తే వాళ్ళ పరిస్థితి ఏమిటి? అని బాగా ఆలోచించాను సర్. అందుకే ఎవరికీ చెప్పలేదు.
ఈనాటి విద్యావ్యవస్థ కి మీరు గోరంత దీపం లాంటివారు. మీ వల్ల ఎందరో చక్కని విద్యార్థులు తయారవ్వాలి. మళ్లీ జన్మంటూ ఉంటే నేను మీ కొడుకుగా పెట్టాలి.
పుట్టి బుద్ధి ఏరిగిన తర్వాత నేను మా ఊరి పొలిమేరలు కూడా ఏనాడు దాటలేదు సర్. మీవంటి గురు దేవుని దగ్గర చదువుకునే అవకాశం కల్పించిన మావయ్యకు కడసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను - సెలవు. పాదాభివందనాలతో –
మీ శిష్యుడు ఏకాంబరం.
ఒక్కసారిగా పెల్లుబికిన దుఃఖము ఉత్తరాన్ని, 500 నోటును తడిపేసింది.
******
నా డైరీలో మొదటి పేజీలో ఏకాంబరం పంపిన 500 కాయితం, ఉత్తరం ఇప్పటికీ నాదగ్గరే ఉన్నాయి - బాల్యంలో నా తెలుగు వాచకంలో మేత పెట్టిన నెమలీకలా...భద్రంగా...ఏకాంబరాన్ని గుర్తుచేస్తూ !!!
