Dinakar Reddy

Abstract Comedy Children

4  

Dinakar Reddy

Abstract Comedy Children

పెళ్లంటే..

పెళ్లంటే..

1 min
360


పెళ్లంటే పందిళ్ళు సందళ్లు తప్పెట్లు తాళాలు.. ఇవన్నీ కాదప్పుడు. మరే చిన్నతనంలో పెళ్లంటే తిరగవాతన్నం(కలర్ రైస్) నూనె వంకాయ. పొద్దుట పెళ్లి అయితే పొంగలి వడ సాంబార్.


నేను పెళ్లికి రావాలంటే మా అమ్మ గుర్తు చేసే తాయిలం తిరగవాతన్నం. నేను రానన్న ప్రతీ పెళ్ళికీ ఏదో ఒక తిండి పేరు చెప్పి తీసుకెళ్లేది అమ్మ. 


మరీ తిండికి మొగమాచిపొయినాను అని మీరనుకోకండి. అదేంటో పెళ్ళిలో తిండి రుచే వేరు.


ఇప్పుడు ముప్పై రకాల ఐటమ్స్ పెడుతున్నారు పెళ్లి విందులో. కానీ పులుసన్నం పెళ్లి పప్పు కాంబినేషన్ కి ఇవేవీ సాటి రావు.


పెళ్లికి వెళ్లి వచ్చేటప్పుడు పెళ్లి వాళ్ళిచ్చే గిన్నెలో, బాక్సో మరచిపోకుండా తెచ్చుకునేది వాటి కోసం కాదు. అందులో ఉంచే పెళ్లి లడ్డు కోసం.


ఆ గిన్నెలు అమ్మ ఎలాగూ అడ్డం అని ఎగబెట్టేస్తుంది పైన. ఎంచక్కా పెళ్లి లడ్డు మిక్చరీ కలిపి తింటుంటే ఆ మజానే వేరు.


మరీ ఎప్పుడూ తిండి గొడవేనా అని అనుకోకండి. పెళ్లికి వెళుతుంటే మంచి బట్టలు వేసుకోమంటారు. అయినా పెళ్లికి పెళ్లి కూతురూ పెళ్లి కొడుకూ ఏం వేసుకున్నారు అని చూడాలి కానీ వచ్చిన వాళ్ళు ఏం వేసుకున్నారు అని చూస్తారా. ఏంటో ఈ పెద్దవాళ్ళు. 


ఇక తెల్లవారుఝాము పెళ్లిళ్ల సంగతే వేరు. అందరికీ నిద్దర వచ్చేస్తూ ఉంటుందా. అప్పుడు సాంగ్యాలకు తయారవుతారు. వక్కాకు సాంగ్యమనీ అదనీ. నాకేమీ అర్థం అయ్యేది కాదు.


ఓ వైపు పెళ్లి జరుగుతూ ఉంటుందా. మరో వైపు టిఫిన్లు తినే వాళ్ళు తినేస్తూ ఉంటారు. ఏమైనా పెళ్ళిళ్ళలో ఎక్కువ హైరానా ఆడవాళ్ళదే. పట్టు చీరలు. మెరిసే నగలు. ఈ చీర వాళ్ళింట్లో పెళ్లికి కట్టుకున్నా అని గుర్తు పెట్టుకునేంత ముడిపడిపోతాయి జ్ఞాపకాలు.


జ్ఞాపకాలంటే గుర్తుకు వచ్చింది. ఫలానా వాళ్ళ పెళ్లికి వెళ్ళాం అని నాకు జ్ఞాపకమే ఉండదు. ఆ పెళ్ళిలో ఏదైనా తిండి గురించో లేక స్పెషల్ స్వీటు గురించో గుర్తు చేస్తే మిగతావి నే చెప్పేస్తా.


ఇక చాల్లే. పెద్దయిపోయాక పెళ్ళిళ్ళకి వెళ్లాలంటే పెద్దగా ఇంట్రెస్ట్ లేదు. నాకు పెళ్ళి కావాలి అంటే నువ్వింకా పెద్దవ్వాలి అంటారు ఇంట్లో.


ఏంటో ఈ పెద్దవాళ్ళు. నాకస్సలు అర్థం కారు.


Rate this content
Log in

Similar telugu story from Abstract