Praveena Monangi

Comedy

4.6  

Praveena Monangi

Comedy

నన్ను పట్టించుకోండి ప్లీజ్

నన్ను పట్టించుకోండి ప్లీజ్

2 mins
326


ఈ మానవులు ఎప్పుడూ ఇంతే. కొత్తది ఏదైనా వచ్చిందంటే చాలు, పాత దాన్ని నిర్లక్ష్యం చేస్తారు. ఇప్పుడు నా పరిస్థితి ఇదే. అవి నా పుట్టుక సంబరాలు జరుపుకునే రోజులు... ఎంత మధురంగా ఉండేవి. చక్కగా నా చుట్టూ కూర్చొని, నన్ను ఆసనంగా చేసుకొని నామీద వంటకాల అమర్చి ఇష్టంగా కుటుంబ సమేతంగా ఆరగించేవారు. అతిథులు వచ్చినప్పుడు నేను మరింత వంటకాలతో ఘుమఘుమలాడుతూ ధగ ధగ మెరిసి, మురిసిపోయే దాన్ని. రోజ్ఉడ్, టేకు, శాండిల్, గ్లాస్ అంటూ మిరిమిట్లు గొలిపే అందం నాది. భోజనశాలకి నేనే రారాజుని. ఎంతటి వారైనా నా దగ్గర ఒంగి కూర్చోవల్సిందే. కానీ ఇప్పటి పరిస్థితి వేరు పూర్తిగా మారిపోయింది. నన్ను ఒక మూలగా ముసలంలా కూర్చోబెట్టారు. 

పైగా నా మీద ఎప్పుడు చూసినా మందు బిళ్ళలు ,టానిక్ సీసాలు, నీళ్ల సీసాలు, కాఫీ కప్పు మూతలు, ఇవి చాలవన్నట్లు అవి ఏమిటి.... ఆ... ఆ... సాల్టు, పెప్పర్. ఇంకా కారం పొడులు, పచ్చళ్ళు ఒకటేమిటి అన్నింటిని నా మీద పడేసి నన్ను ఒక మూలన తోసేశారు. నా ఆలనాపాలనా చూసే తీరుబాటే లేదు ఎవరికి. పోనీ పండ్లు ఏమైనా పెడతారంటే అవి లేవు . ఒక వేళ పెట్టినా ప్లాస్టిక్ పండ్లు పెడుతున్నారు. వాటిని ఏమైనా కోరుక్కోని తినగలమా చెప్పండి! ఇంతకీ నేను మూలన పడిపోవడానికి కారణం ఎవరో తెలుసా మీకు! ఇంకా ఎవరండీ, ఆ మాయదారి బొమ్మలు పెట్టి టీవీ అండి. అది వచ్చింది నా కొంప ముంచింది. బెల్లం చుట్టూచేరిన ఈగల్లాగా నా చుట్టూ ఉన్న వారందరూ ఇప్పుడు ఆ పెట్టె ముందు అన్నం పళ్ళెం పట్టుకుని చేరిపోయారు. ఇంక అక్కడే తినడం, తాగడం, పడుకోవడం అన్ని కార్యక్రమాలు జరిగిపోతున్నాయి. 

నా ప్రక్కన కూర్చోవడం లేదు సరికదా నన్ను నానారకాలుగా వాడుకుంటున్నారు... అదిగదిగో చూడండి మా ఇంటి యజమాని స్నానం చేసి వచ్చి తుండు గుడ్డని బయట ఆరవేయకుండా నా మీద పడేసాడు. ఇక మా ఇంటి ఇలవేల్పు వంట చేస్తూ చేతులు తుడుచుకుంటూ ఆనేప్కిన్ ని నా మీద పడేస్తుంది. ఇంక మా బుజ్జి యువరాణి సంగతి చెప్పనక్కర్లేదు ముక్కు తుడుచుకుంటూ రుమాలుని నా మీద వేస్తుంది. ఒంటి మీద వేసుకుని చున్నీలు నా మీద వేస్తారు. ఇవన్నీ చూస్తూ ఒక్కోసారి ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తుంది అంటే నమ్మండి. 

అయినా నాకు ఈ శాస్తి జరగాల్సిందే ఎందుకంటారా? నేను వచ్చిన కొత్తలో నన్ను చూసుకుని పీటని మూల పడేసారు. అప్పుడు పీట ఎంత బాధ పడింది. నేను పీటని హేళన చేస్తూమిడిసిపాటుతో విర్రవీగాను. అప్పుడు పీట ఎంత బాధ పడి ఉంటుందో నాకు ఇప్పుడు అర్థం అవుతుంది. అంతేలే చేసిన పాపం ఊరికే పోతుందా అనుభవించవలసిందే!

అదిగో అదిగో ఎవరో కాలింగ్ బెల్ కొట్టారు.. బహుశా చుట్టాలొస్తున్నారు ఏమో!, ఓహో! చుట్టాలు కాదా! పెళ్లి పిలుపా? రోజూ ఇలా ఎవరైనా వస్తారా అని ఎదురు చూపులతోనే సరిపోతుంది. ఎందుకంటారా అతిథులు వచ్చినప్పుడే కదా నా మీద పేర్చిన దరిద్రాలన్నీ తీసి నన్ను శుభ్రపరిచే ది.. అలాంటప్పుడే కాస్త బ్రతుకు మీద ఆశ పడుతుంది. అయినా నా పిచ్చి గాని ఈ మధ్యన బంధువులు భోజనానికి ఎక్కడ వస్తున్నారు. ఒకవేళ వచ్చినా వాళ్లకి కూడా ఆ మాయదారి పెట్టె దగ్గరే వడ్డిస్తున్నారు లేదంటే అందరూ కలిసి బయటకి హోటల్ కి వెళ్లి పోతున్నారు. ఎక్కడో కొద్దో గొప్పో మంచి మనసున్న మనుషులు ఉండడం వలన ఆ పీట, నేను ఇంకా ప్రాణాలతో ఉన్నాము.

 అయినా రోజులు మారుతున్నాయి లెండి. ఆ మాయదారి పెట్టి గర్వాన్ని అనగకొట్టడానికి చిన్న డబ్బా. అదేనండి సెల్ ఫోన్ వచ్చిందంటగా! అది వచ్చినప్పటినుండి టీవీని చూడటం తగ్గించేసారంట కదా! దాని రోగం కుదిరిందిగా, ఎంత మిడిసి పడింది కదా!మీరు చూస్తూ ఉండండి సెల్ ఫోన్ వాడుతూ భోజనం తినడానికి మళ్లీ నా దగ్గరికే వస్తారు ఈ జనం,ఎందుకంటే సెల్ ఫోన్ పెట్టడానికి నేను కావాలి కదా! అదేనండి, “డైనింగ్ టేబుల్’’ కావాలి కదా అంటున్నా! ఏంటి అంతే అంటారా?


Rate this content
Log in

Similar telugu story from Comedy