Praveena Monangi

Tragedy

4  

Praveena Monangi

Tragedy

కనువిప్పు

కనువిప్పు

4 mins
2.1K


అదే మొదటిసారి నేను రైలులో వైజాగ్ నుండి విజయవాడ కి ఒంటరిగా ప్రయాణించడం .రైలు ఎక్కించడానికి మా వారు వచ్చారు.చేరగానే ఫోన్ చేయమని మధ్యమధ్యలో మెసేజ్ లు పెడుతు౦డమని అన్ని జాగ్రత్తలు మరీ మరీ చెప్పి ఆయన బయలుదేరారు .కొంచెం భయపడుతూనే రైలు ఎక్కాను .నా బెర్త్ నెంబర్ చూసుకుని కూర్చున్నాను.నా ఎదురు బెర్త్ లో ఒక ఆమె నన్నే చూస్తూ కనిపించింది .వయసులో నాకన్నా కొంచెం చిన్నది అనుకుంటా .చక్కగా ఉంది కన్ను ముక్కు తీరు చాలా ఆకర్షణీయంగా ఉంది ఆమె.

"హలో అండి నా పేరు నవ్య’’ అని తనని తాను పరిచయం చేసుకుంది .

"హాయ్ అండి నా పేరు ప్రవీణ "

“ఏమిటి మొదటిసారా ఒంటరిగా ప్రయాణం?’’

"అవునండి మీకెలా తెలుసు ?"

“చాలాసేపటినుండి మిమ్మల్ని మీ వారిని గమనిస్తున్నాలేండి అందుకే అడిగా ?మీ బెరుకు పోవాలని నేను మాట్లాడుతున్నా!"

“ఓహ్ ! చాలా థ్యాంక్స్ అండీ ఎప్పుడూ ఆయనతో నే వెళ్తాను కానీ ఈసారి తప్పనిసరి వెళ్లి తీరాలి. నేను వ్రాసిన కథకు బహుమతి వచ్చింది నాకు సన్మానం జరగబోతుంది విజయవాడ లో.మా వారికి ఆఫీసులో లీవు దొరక లేదు.

"కంగ్రాట్స్ అండి మీరు రచయిత్రా ?"

“అవునండీ నేను ఫ్రీలాన్స్ రైటర్ ని కథలు, కవితలు వ్యాసాలు, వ్రాస్తుంటాను’’.

"మీరు ఏమి చేస్తుంటారు ?మీరు ఎక్కడి వరకు వెళ్తున్నారు?

"నాదేముంది నేను సాధారణ గృహిణినే (ఆ మాట చెబుతుంటే ఆమె ఎందుకో దిగులుగా కనిపించింది ).నేను విజయవాడ వెళ్తున్నాను మా అబ్బాయి హాస్టల్ లో ఉండి చదువు కుంటున్నాడు. వాడిని కలవడానికి వెళుతున్నాను.”

“ఓహ్ అలాగా!’’

“అయితే నేను ఒక రచయిత్రిని కలుసుకున్నా అన్నమాట’’ (ఆమె కళ్ళల్లో మళ్లీ ఒక మెరుపు )ఇలా కాసేపు కబుర్లు చెప్పుకున్నాము .పిల్లల విషయాలు మాట్లాడుకున్నాము .కొంత సేపు నిశ్శబ్దం .ఈ లోగా మా వారి వద్ద నుండి  ఫోన్లు, మెసేజీలు అన్నీ జరిగిపోయాయి.ఇంతలో ఆమె నాతో

"ప్రవీణ గారు నాది ఒక కోరిక చెప్పమంటారా ?"

“హా చెప్పండి "

"మీరు నా కథను వ్రాస్తారా ?"

నాకు ఒకింత ఆశ్చర్యం కలిగింది ."మీ కథనా? "అని సందేహంగా అడిగాను.

"అవునండి నాకథే . నా జీవితం పదిమందికి గుణపాఠం కావాలి.నా కథ ద్వారా నాలాంటి ఎందరో అభాగ్యులైన ఆడపిల్లలను ఆదుకోవాలి. చెప్పండి వ్రాస్తారా?’’ అని చాలా ఆతృతగా అడిగింది. సరేనండి చెప్పండి చూద్దాం అని అన్నాను .అప్పుడు నవ్య తన కథను చెప్పడం ప్రారంభించింది .మరి చదవండి ఆమె కథ నా వ్రాతలలో.....

“నేను ,మా అన్నయ్య కిషోర్ ఇద్దరూ అల్లారుముద్దుగా పెరిగాము.మా నాన్న గారిది వ్యాపారము.అమ్మ గృహిణి .మాది అందమయిన పొదరిల్లు. నేను ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం లో జాయిన్ అయ్యాను .పదవ తరగతి వరకు చాలా బాగా చదువుకున్నాను. స్కూలు వాతావరణం నుంచి కాలేజీ వాతావరణానికి ఒక్కసారిగా అలవాటు పడలేక పోయాను . అంతా కొత్త కొత్తగా గందర గోళముగా అనిపించింది. అటువంటి సమయంలో పరిచయమయ్యాడు రవి.చాలా విషయాలలో నాకు చాలా సహాయం చేసేవాడు. ఆ పరిచయం కాస్తా మా ఇరువురి మధ్య ప్రేమగా మారింది. దీని వలన నేను చదువులో బాగా వెనకబడి పోయాను.ప్రథమ సంవత్సరం తక్కువ మార్కులతో పాసయ్యాను.మా నాన్నగారు విషయం ఆరా తీయగా నా ప్రేమ విషయం బయటపడింది.ఈ వయసులో ప్రేమ ఏమిటి అని మా నాన్న మందలించారు,అన్న భయపెట్టాడు.ఎవరి మాటలు నాకు రుచించలేదు.రవి తప్ప నాకు అప్పుడు ఏదీ ముఖ్యం కాదు అనిపించేది.అలా ప్రేరేపించాడు రవి తన మాటలతో. నా విషయంలో ఏం చేయాలో అర్థం కాక మా నాన్న, అన్న రకరకాలుగా ప్రయత్నాలు చేసి విఫలమయ్యారు.చివరకు కాలేజీ మాన్పించేశారు.ఒకరోజు అర్ధరాత్రి ఇరువైపుల కుటుంభాల సహకారం లేకుండా కేవలం ముగ్గురు స్నేహితుల సహాయంతో ఇంటి నుండి పారిపోయి పెళ్లి చేసుకున్నాము. ఇక చేసేదేమీ లేక మా నాన్న, అన్న పూర్తిగా నా మీద నీళ్లు వదిలేశారు.

ఇదిగో ఇక్కడినుండి నా కష్టాలు ప్రారంభమయ్యాయి.చెప్పకుండా పెళ్లి చేసుకున్నాడన్న కారణంగా రవి తల్లిదండ్రులు మమ్మల్ని ఇంటికి రానివ్వలేదు.చేసేదేమీ లేక చిన్న గది అద్దెకు తీసుకొని కాపురం ప్రారంభించాము.కానీ నెల తిరిగేసరికి అద్దెకు,పాలకు,నీళ్ళకు డబ్బులు ఎలా వస్తాయి? ఇద్దరo చదువుతున్నది ఇంటర్మీడియట్ కదా! రోడ్డున పడ్డాము.తన గుమ్మం తొక్కితే కాల్చిపారేస్తానని మా నాన్న కిషోర్ ద్వారా చెప్పించారు.ఇక చేసేదేమీ లేక రవి తన తల్లిదండ్రులను బ్రతిమలాడు కున్నాడు.వాళ్లు చాలా కష్టం మీద ఇంటికి రానిచ్చారు.కానీ నా బ్రతుకు పని మనిషి బ్రతుకై పోయింది.రవికా ఉద్యోగం లేదు. నేను ఏమైనా చేద్దామా అంటే చదువు లేదు.పుట్టింటివారా అంటే అలా అయిపోయింది.ఇంక ఏం చేస్తాను ఎదురుతిరిగితే నిలువు నీడ కూడా లేకుండా పోతుందని అర్థం చేసుకొని పని మనిషిగా గా స్థిరపడిపోయాను.రవి చేసిన పనికి తనకు చదువు మాన్పించి వేశారు.ఏదైనా ఉద్యోగం చూసుకోమన్నారు మా అత్తమామలు.మరేం చేస్తాడు ప్యూన్ గా చేరాడు.కానీ అక్కడ కూడా పని  చేయలేకపోయాడు.మా పుట్టింటి వాళ్లు బాగా డబ్బున్న వాళ్లు నన్ను పెళ్లి చేసుకుంటే అక్కడ నుండి బాగా డబ్బు వస్తుందని ఆశించాడు రవి.అది కాస్త వికటించింది.దాంతో చెడు వ్యసనాలకు లోనయ్యాడు.ఎలా తెస్తున్నాడో   తెలియదు అప్పుడప్పుడు ఇంటికి డబ్బులు తెచ్చి వాళ్ళ అమ్మ చేతిలో పెడుతున్నాడు.ఏమీ చేయలేని పరిస్థితుల్లో నేను అన్నీ భరిస్తూ వచ్చాను. అన్నీ తెలుసుకుని, నా జీవితం ఇలా అయిపోయిందేమిటి అని అనుకున్నంత లోపలే నేను ఒక బిడ్డకి తల్లిని అయిపోయాను.బిడ్డ పుట్టిన తర్వాత అయినా తన మామలో మార్పు రాకుండా పోతుందని ఆశించిన రవికి మా నాన్న నుండి తిరస్కారం ఎదురయ్యింది.దీంతో మరింత రగిలిన రవి నాతో కొట్లాటకు దిగేవాడు.భాదని దిగమింగుకొని జీవిస్తున్న నేను అంతలోనే మరో బిడ్డకు తల్లి నయ్యాను.ఇద్దరు పిల్లలతో బండెడు చాకిరీ చేస్తూ.. అల్లారుముద్దుగా పెరిగిన నేను మోయలేనంత భారాన్ని మోస్తూ కాలం గడిపాను.

బట్టలు ఉతుకుతూ రవి జేబులో చూడరాని వస్తువులను చూస్తూ కుమిలిపోయాను.నా భర్త నా ఎదుటే స్నేహితులతో అమ్మాయిల సైజులు గురించి , వారి రేట్లు గురించి మాట్లాడుతుంటే నా మనసు విలవిలలాడి పోయింది.నా ఇద్దరు బిడ్డల భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ స్థాణువై ఉండిపోయాను.మరేం చేస్తాను ఎదురు తిరగలేను, పుట్టింటికి పోలేను, చదువుకోలేదు ,ఎక్కడికి వెళ్లి పోతాను.అందుకే అన్నీ భరిస్తూ అక్కడే ఉండిపోయాను.ఇదీ తెలిసీ తెలియని వయసులో ప్రేమ ఆకర్షణలో పడి తల్లిదండ్రులను లెక్క చేయకుండా ఇంట్లో నుండి వెళ్లిపోయిన నా కథ.ఇందులో ఏముంది చాలా సినిమాల్లో ఇలాంటివి చూసాము కదా! అని మీరు అనుకోవచ్చు. కానీ మనసు ,వయసు పరిపక్వత చెందని వయసులో ప్రేమ పెళ్లిళ్లు చేసుకుంటున్న నాలాంటి అమ్మాయిలకు కనువిప్పు కలగాలి. నా జీవితం అయిపోయింది. ఎన్ని కష్టాలు, బాధలు అవమానాలు, భరించాలో అన్నీ భరించాను,దిగమింగు కొన్నాను, నాలో నేనే కుమిలిపోయాను. నేను పడిన వేదన మీకు మాటల్లో వివరించలేను.కానీ అనుభవించిన నాకు తెలుసు ఆ నరక యాతన ఏమీ చేయలేని స్థితిలో కేవలం నా పిల్లల కోసమే అన్నింటిని భరిస్తూ చెప్పాలంటే జీవశ్చవమ్ లా ఉన్నాను అంతే...అంటూ కన్నీళ్ళు కార్చింది.ఆమె కథ విన్న నా మనసు చలించింది.నిజమే ఆమె చెప్పినట్లు ఇలాంటివి చాలా వింటుంటాము.కానీ ప్రత్యక్షంగా తన యదార్ధ గాద నాకు చెప్పింది. అప్పుడే నిర్ణయించుకున్నాను తన కథను వ్రాయాలని.

నిజానికి నవ్య నన్ను ఈ కథ రాయమని కోరడం లో ముఖ్య ఉద్దేశ్యం తన లా మరి ఏ అమ్మాయి బలి అవకూడదని...నిజమే కదా!ఈ మధ్యన ఎక్కడ చూసినా,విన్నా ప్రేమ,ప్రేమ పెళ్లిళ్లు..ఇవి ఎంతవరకు సఫలం అవుతున్నాయి.అల్లారు ముద్దుగా పెంచుకున్న తల్లి తండ్రులను కాదని ,మాయ మాటలు చెప్పి రెండు ప్రేమ వాఖ్యాలు చెబితే దానినే ప్రేమ అనుకుని, తెలిసీ తెలియని వయసులో పరిపక్వత చెందని మానసిక స్థితిలో ఇంటిలో నుండి వెళ్ళి పోతున్న ఓ అమ్మాయిళ్ళారా! కాస్త ఆలోచించండి.నవ్య లాగా మీ జీవితాన్ని పాడుచేసుకోకండి.కాస్త ఆలోచించండి మేలుకోండి.మీ జీవితానికంటూ ఒక లక్ష్యం ఉంది దానిని సాదించడానికి ప్రయత్నించి మీదంటూ సమాజములో ఉన్నతమైన స్థానాన్ని సంపాదించుకోండి.


Rate this content
Log in

Similar telugu story from Tragedy