Praveena Monangi

Children Stories

4.5  

Praveena Monangi

Children Stories

తొలి అడుగులు

తొలి అడుగులు

4 mins
573


తొలి అడుగులు


సాయంత్రం ఆరు గంటల సమయమయ్యింది...వేడివేడిగా కాఫీ తాగుదామని మావారి రాక కోసం గుమ్మం లో ఎదురు చూస్తున్న నాకు..అపార్ట్ మెంట్ ఇంటర్ కం ఫోన్ మోత వినబడడం తో లోపలికి వచ్చి ఫోన్ తీసుకుని హలో అనగానే అవతలి నుండి...


‘’నేను ప్రియ ని మాట్లాడుతున్నాను’’


‘’ఓ ప్రియ గారు చెప్పండి!ఏమిటి విషయం?’’


‘’రేపు మా అబ్బాయి పుట్టిన రోజండి మీరు,మీ పాప,మీ వారు తప్పకుండా రండి’’


‘’అవునా!పాపని పంపిస్తాను లెండి..మేము ఎందుకు’’


‘’అలా కాదండి.. చిన్నపిల్లలు ఉన్నారు కదండీ కొందరికి... వాళ్లేమో రావడం మానేస్తారు..అందుకేఅందరినీ కలిపి ఇలా పిలిచాము..ఇలా అయితే ఎవరి పి‌ల్లలలని వాళ్ళు చూసుకుంటారు..మాకు పార్టీ నిండుగా ఉంటుంది.అందరికీ భోజనాలు ఇక్కడే..పార్టీ కింద అపార్ట్ మెంట్ సెల్లార్ లో చేస్తున్నాము..అందరికీ సౌకర్యముగా ఉంటుంది అని..’’


‘’సరే ప్రియ తప్పక వస్తాము’’అని ఫోన్ దించేశాను..గుమ్మం లో మావారు ప్రత్యక్ష మయ్యారు.ఇద్దరం వేడివేడి కాఫీ తాగుతూ..ప్రియ గారి పిలుపు గురించి చెప్పాను మావారికి ..


‘’రేపు నేను ఆఫీసు నుండి రావడం లేటవవచ్చు..నువ్వు ,తన్మయ వెళ్ళండి..నేను తరువాత వచ్చి జాయిన్ అవుతాను లే’’


‘’సరే నండి అలాగే చేద్దాం’’ఇంతలో మా అమ్మాయి తన్మయ చదువు లో ఏదో సమస్య వచ్చినట్లుంది నన్ను పిలిచింది అమ్మా! అని..మా అమ్మాయి ఒకటవ తరగతి చదువుతుంది.పార్టీ గురించి చెప్పగానే ఒకటే ఆనందం కేక్ కట్ చేస్తారా? ఏ డ్రస్ వేసుకోవాలి?ఒకటే ప్రశ్నల వర్షం కురిపించింది.ఇంక తన ప్రశ్నలకి సమాధానమిచ్చి..తనకి చదువు చెప్పి..నా పనులు అన్నీ కానిచ్చి భోజనాలు ముగించి.. ఆ రోజుని నిద్ర పోతూ ముగించాము.


మరుసటి రోజు సాయంత్రం నేను,తన్మయ ప్రియ వాళ్ళ అబ్బాయి పుట్టినరోజు ఫార్టీ కి తయారయ్యి..లిఫ్ట్ లోకి వెళ్లాము ..మేము ఉండేది నాలుగో ఫ్లోర్ లో..లిఫ్ట్ మూడులో ఆగింది..ముగ్గురు ఎక్కారు..కొత్తగా వచ్చినట్లున్నారు..నాకు పరిచయం కాలేదు..అయిన సరే నవ్వాను..బదులుగా ఆమె నవ్వలేదు..పైగా వాళ్ళ అబ్బాయి.. తొమ్మిదేళ్లు ఉంటాయనుకుంటాను..నా కాలిని గట్టిగా తొక్కాడు..నాకు చాలా నొప్పి పుట్టి...చూసుకోవాలి కదా బాబు అంటే ఆ అబ్బాయి కనీసం నా మాట వినటానికి కూడా సిద్ధంగా లేడు ..ఎంతో నిర్లక్ష్య ము గా ప్రవర్తించాడు..వాళ్ళ అమ్మ నాన్న కూడా అంతా చూస్తూ బాబు ని ఏమి అనలేదు..నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది.ఇంతలో లిఫ్ట్ కిందికి దిగింది.


పార్టీ కి అప్పటికే చాలా మంది వచ్చారు..ఈయనకి ఫోన్ చేస్తే ఇంకా సమయం పడుతుందని చెప్పారు..ప్రియ నికలిసి మాట్లాడాను.బాబుకి ఇదే మొదటి పుట్టినరోజు..బాబుబలే ముద్దుగా ఉన్నాడు. చుట్టాలు,బంధువులు,స్నేహితులతో పార్టీ కళకళ లాడుతుంది.కేక్ కట్ చేశారు..అందరికీ పంచి పెట్టారు..అందరూ తిని ఎక్కడి ప్లేట్ లను అక్కడే పడేశారు..ఒక్క అబ్బాయి మాత్రమే తను తిన్న ప్లేట్ ని (పేపర్ ప్లేట్ )తీసుకెళ్లి డస్ట్ బిన్ లో వెయ్యడం నన్ను ఆకర్షించింది..ఆ అబ్బాయి వచ్చి మా పక్కనే కూర్చున్నాడు..పక్కనే వాళ్ళ తాతయ్య నాన్నమ్మ అనుకుంటాను..నాకు ముచ్చటగా అనిపించి మాటామాట కలిపాను..


‘’మీరు కొత్తగా వచ్చారా అండి?..నేను మిమ్మల్ని ఇదివరకు చూడనే లేదు’’


‘’అవునమ్మా!కొత్తగా అంటే రెండు నెలలు పైనే అవుతుంది మేము వచ్చి..201 మాది’’అని పెద్దావిడ సమాధాన మిచ్చింది.


‘’అవునా!తెలియనే లేదండీ..మాది 401 అండి.మరి బాబు వాళ్ళ అమ్మానాన్న రాలేదా అండి?’’


‘’వాళ్ళు ఇక్కడ లేరమ్మా!


‘’మా అబ్బాయి కోడలు అమెరికాలో ఉంటారమ్మ!ఇద్దరూ ఉధ్యోగము చేస్తున్నారు..బాబు చిన్నప్పటి నుండి మా దగ్గరే ఉన్నాడు..’’అని బాబు తల నిమురుతూ ఎంతో ప్రేమ గా సమాధానము చెప్పింది.


అంతలో బాబు కాలు పొరపాటున నాకు తగిలింది..వెంటనే వాళ్ళ తాతయ్యకి చెవిలో ఏదో చెప్పటాన్ని నేను గమనించాను..ఇంతలో తన్మయ ఏదో చెబుతుంటే అటుగా తిరిగిన నన్ను పిలిచి


వాళ్ళ తాతయ్య నాతో ‘’ఏమీ లేదమ్మ!వాడి కాలు పొరపాటున నీను తగిలింది అంట..నీకు సారీ చెప్పమంటున్నాడు.’’


‘’నేనెందుకురా!నువ్వే చెప్పవచ్చు కదా! అంటీకి సారీ అని..వీడికి సిగ్గు ఎక్కువమ్మా!’’


ఆ మాటలు నన్ను ఆశ్చర్యానికి గురి చేసి బాబు వంక అలా చూస్తూ ఉండిపోయాను..వాడు సిగ్గు తో వాళ్ళ నాన్నమ్మ చీర చెంగుతో ముఖాన్ని దాచేసుకున్నాడు..నాకు వెంటనే ఇందాక లిఫ్ట్ లో జరిగిన సంఘటన గుర్తుకొచ్చింది..ఇద్దరి ప్రవర్తనలో ఎంత వ్యత్యాసం ఉన్నది..పైగా ఆ అబ్బాయి వయసులో ఈ బాబుకన్నా పెద్దవాడు అని నాలో నేను అనుకున్నాను..


ఇంతలో పార్టీ లో ఈవెంట్ ఏంకర్ పిలుపుతో మా దృష్టి అటువైపు మళ్ళింది..అంతలోనే మావారు కూడా వచ్చారు ఆయనకి తాళాలు ఇచ్చాను ఫ్రెష్ అయి వస్తారని. ఏంకర్ పిల్లలకి ఏవేవో ప్రశ్నలు అడిగింది..బహుమతులు ఇచ్చింది..పెద్దవాళ్ళు బోర్ అవకూడదని మాకు కూడా కొన్ని ప్రశ్నలు వేసింది.అందరూ ఉత్సాహముగా సమాధానమిచ్చారు.పిల్లలు పాటలు పాడారు..డాన్సులు వేశారు..అంతలో


‘’ఎవరయినా తెలుగు అ నుండి ఱ వరకు తప్పులు లేకుండా మొదటి నుండి చివర వరకు చెప్పగలరా’’?అని ఏంకర్ ప్రశ్నించింది..అందరిలో ఒక్క సారిగా నిశ్శబ్ధం నెలకుంది.అయినా సరే పిల్లలందరూ ప్రయత్నించారు ..కానీ ఎవ్వరూ సరిగా చెప్పలేక పోయారు..నా పక్కనే కూర్చున్న బాబు (పేరు రాహుల్ )లేచి వాళ్ళ తాతయ్య తో ముందుకి వెళ్ళాడు..ఏంకర్ వాళ్ళని చూసి..


‘’నువ్వు చెబుతావా బాబు’’?అని ఏంకర్ అడుగుతుండ గా మావారు వచ్చి మా పక్కన కూర్చున్నారు.


‘’ఆ చెబుతా’’అని రాహుల్ మైక్ చేతిలోకి తీసుకుని ఎంతో స్పస్టముగా ముద్దుగా అనుండి ఱ మొత్తం చివర వరకు చెప్పాడు..నేనయితే అలా ఆశ్చర్య చకితురాలినయిపోయాను..నేనయినా తప్పులు లేకుండా చెప్పగలనా అని అనిపించింది.తరువాత వాళ్ళ తాతయ్య చెప్పు చెప్పు అంటున్నారు..ఏంకర్ అది గమనించి ఇంకేమయిన చెబుతావా బాబు అని అడిగింది.అవును అని చెప్పి...బాబు వెంటనే విఘ్నేశ్వర శ్లోకం,గాయత్రి మంత్రం,సరస్వతీ స్తోత్రం చాలా చక్కగా చెప్పాడు..హాలంతా చప్పట్ల మయమయ్యింది.గబగబా వాళ్ళ నాన్నమ్మ దగ్గరకు వచ్చి హత్తుకున్నాడు.ఇదంతా చూస్తూ మాకు చాలా ముచ్చట వేసింది.


‘’బాబు తెలుగు మీడియం చదువుతున్నాడా అండి ?’’అని బాబు వాళ్ళ నాన్నమ్మ ని అడిగాను..


‘’కాదమ్మా!ఇంగ్లీషు మీడియం లోనే చదువుతున్నాడు’’


‘’మరి ఇంత బాగా తెలుగు ఎలా?’’


‘’మేము ఉన్నాము కదమ్మా!వాడికి తెలుగు నేర్పటానికి’’అంటూ వాళ్ళ తాతయ్య బాబుని ఒడిలోకి తీసుకుంటూ చెప్పారు..


‘’బాబు ఏమి చదువుతున్నాడు?’’


‘’ఒకటవ తరగతి చదువుతున్నాడు..ఇదివరకు మేము ఉండే ఏరియా బాబు స్కూల్ కి దూరం అయిపోయింది అందుకే రెండు నెలల క్రిందటే ఇక్కడికి వచ్చాము’’


‘’మరి బాబుకి శ్లోకాలు ఎలా వచ్చు’’?


‘’వాళ్ళ నాన్నమ్మ ఉంది గా..రోజూ పొద్దున్నే ఆవిడతో పాటు లేచి..స్నానం ముగించి..పూజ గదిలో కూర్చుంటాడు..ఇక ఆవిడ పలికేవన్నీ నేర్చుకున్నాడు..అయినా! మన మాతృ బాష ,మన దేవుడి శ్లోకాలు నేర్చుకోక పోతే ఎలా అమ్మా?మనమే నేర్పాలి’’ అని అనేసరికి..నాకు చెంప మీద ఎవరో కొట్టినట్లనిపించింది.


కొంచెం సమయం అయ్యేసరికి బిడియం పోయి మాతో కలిసిపోయాడు రాహుల్ ..చక్కగా మాట్లాడాడు..ఆ మాటలలో ఎంతో వినయం..సంస్కారం..ఒబ్బిడి..నన్ను ఎంతగానో ఆకట్టుకున్నాయి..ఇంతలో శ్లోకాలు,అ నుండి ఱ వరకు చక్కగా చెప్పిన రాహుల్ కి బహుమతి తీసుకోవడానికి స్టేజి పైకి పిలిచారు.వెళ్ళనా అన్నట్లుగా వాళ్ళ తాతయ్య వైపు చూశాడు..తాతయ్య వెళ్ళు అని సైగ చేస్తే,వెళ్ళి బహుమతి అందుకుని చిన్న చిరునవ్వుతో తిరిగి నాయనమ్మ వద్దకు వచ్చి కూర్చున్నాడు.రాహుల్ ప్రతీ చర్యలో సంస్కారము ఉట్టిపడుతోంది.నాకు ఆశ్చర్యం అనిపించింది...ఈ రోజుల్లో పిల్లలలో ఇంతటి వినయ విదేయతలా!నాకు నమ్మ బుద్ది కాలేదు..కానీ కళ్లెదురుగా కనబడుతుంటే నమ్మకున్నా ఎలా ఉండగలను.


పెద్దల దగ్గర పెరిగితే పిల్లలు ఇలా ఉంటారన్నమాట!నిజముగా మన పిల్లలు ఏమి కోల్పోతున్నారో నాకు అర్దమయ్యింది..పిల్లలకు పెద్దల అనుభవాలు..వాళ్ళ సంరక్షణ..వాళ్ళ తోడు..అచ్చట ముచ్చట అన్నీ పెద్దలతోనే ముడిపడి ఉన్నాయి..నేటి ఉరుకుల పరుగుల జీవితములో పిల్లలకు నాన్నమ్మ,తాతయ్య ,అమ్మమ్మలే మార్గదర్శకులు.కానీ ఈ రోజులలో ఎంతమంది పిల్లలు పెద్దల సంరక్షణ లో పెరుగుతున్నారు?ఉధ్యోగరీత్యా పెద్దలకి దూరముగా ఉండవలసిన పరిస్థితి కొందరిదయితే...తల్లీతండ్రీ ఇద్దరూ ఉధ్యోగాలకు వెళుతూ ఆయాల వద్ద,బేబీ కేర్ సెంటర్ లలో పెరిగుతున్నవారు మరి కొందరు..అత్త కోడలకు సరిపడక వేరువేరుగా ఉంటున్నవారు కొందరు..ఇలా ఏ విధముగా చూసిన నేటి పిల్లలకి పెద్దల సంరక్షణ తగ్గిందనే చెప్పాలి.ప్రతీ పిల్లలకి పెద్దల అవసరము ఎంతయినా ఉంది..ఎందుకంటే పిల్లలు వేసే ‘’తొలి అడుగులు’’సక్రమముగా పడినప్పుడే వాళ్ళ భవిష్యత్తు బంగారు బాట అవుతుంది. అందుకు చక్కటి ఉదాహరణే రాహుల్.మళ్ళీ ఆరోజులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను..


నిజముగా ఆ రాహుల్ ఎవరి కొడుకో గాని..వాళ్ళ తల్లితండ్రులు చాలా అదృష్టవంతులు.



Rate this content
Log in