నేరము - శిక్ష
నేరము - శిక్ష
లాయర్ లా వాదిస్తున్నావ్. మనిషిలా ఇంగిత జ్ఞానం మాత్రం ఉపయోగించట్లేదు. విశ్వనాథం తనలో తానే అనుకుంటున్నాడు.
రాత్రి తొమ్మిది గంటలకు జరిగిన హత్యలో నిందితుడు రాజు తొమ్మిది గంటలా పది నిముషాలకు తనతో కూర్చుని మందు కొట్టాడు.
గత నెల ఇరవై రెండో తారీఖున రాత్రి తొమ్మిది గంటలకు రాజు భార్యను ఎవరో ముఖానికి మాస్కు వేసుకున్న వ్యక్తి హత్య చేసినట్లు వీడియో ఆధారాలు దొరికాయి.
రాజు ఇంటికీ తన ఇంటికీ ముప్పై కిలోమీటర్ల దూరం ఉంది. అదే రోజు రాత్రి తొమ్మిది గంటలా పది నిమిషాలకు తన మొబైల్లో రాజుకు ఫోన్ చేయడమూ, అది తన ఇంటి బయటే మ్రోగడమూ జరిగాయి. తలుపు తెరిచి చూస్తే రాజు అక్కడే ఉన్నాడు.
ముప్పై ఏళ్ల స్నేహం తమది. కలిసి మందు తాగుతూ ఎన్నో విషయాలు మాట్లాడుకునే వాళ్ళు. ఇప్పుడు భార్యను హత్య చేసిన కేసులో చిక్కుకున్న స్నేహితుణ్ణి కాపాడుకోవడానికి శతవిధాలా ప్రయత్నిస్తున్నాడు.
పోలీసులు రాజే స్వయంగా అతని భార్యను హత్య చేశాడని, ఫోరెన్సిక్ నిపుణులు ఇచ్చిన సాక్ష్యాల ద్వారా చెబుతున్నారు.
ఎలా ఇప్పుడు. ఇంతకీ రాజు హత్య చేశాడా? అసలు ఆ రోజు రాత్రి రాజు తన ఇంటికి వచ్చినట్లు మా ఇంట్లోని సీసీ కెమెరాల్లో ఎలా రికార్డ్ అయ్యింది. అతను రాకపోతే మరి వచ్చింది ఎవరు? లాయర్ విశ్వనాథం న్యాయదేవత బొమ్మ వైపు చూశాడు.
ఆమె కళ్లకు కట్టిన నల్లటి గంతలు విప్పబోయాడు.
