మూగబోయిన మౌనగీతం
మూగబోయిన మౌనగీతం
మూగబోయిన మౌనగీతం
-శానాపతి(ఏడిద)ప్రసన్నలక్ష్మి
కాకి ముక్కుకి దొండపండా...?
పార్టీలో వారిద్దరినీ చూసాకా...నా మనసెంతగా ఈర్ష్య పడిందో...!
నా పరిస్థితీ అదే కదా అనుకున్నాను.
అక్కడ - రఘురామ్ కాకైతే ...వాడి భార్య దొండపండు.
ఇక్కడ - నేను దొండపండైతే...నాభార్య కాకి...!
ఎంతో మన్మధుడిలా వుండే నాకు..ఓ మోస్తరు అందమున్న అమ్మాయి మాత్రమే భార్యగా వచ్చింది. అందులోనూ నల్లటి తుమ్మమొద్దుని కట్టుకున్నందుకు మనసంతా పాడైపోయింది. ఆలోచిస్తుంటే... పిచ్చెక్కిపోతుంది. ఎంతైనా...తల్లిదండ్రుల్ని అనాలి. సంబంధం చూసేటప్పుడు...నాలాంటి అందగాడికి తగ్గా అమ్మాయిని చూడాలన్న ఇంగిత జ్ఞానం వాళ్లకు లేనందుకు. నా అంతట నేను నచ్చిన అమ్మాయిని చేసేసుకోలేక కాదు. అలా చేసుకుంటే...మావాడు మాపరువు తీసేసాడని కాకిగోల చేసేవారు. వారి పెద్దరికానికి కొంచెం గౌరవం ఇచ్చినందుకేగా నాజీవితంతో ఆడుకున్నారు. పెళ్లి చూపుల్లో అమ్మాయి నాకు నచ్చకపోయినా...పదెకరాల పంట పొలం , పది లక్షల కట్నం , వంద కాసుల బంగారం ఇస్తున్నారని ఆశపడి...నన్నీ పెళ్లికి బలవంతంగా ఒప్పించారు. నాకున్న బ్యాంక్ ఉద్యోగం తప్పించి...వెనకేమీ ఆస్థుపాస్తులేమీ లేకపోవడంతో... తలూపక తప్పలేదు. మనసు ఏడుస్తున్నా...నవ్వు మొఖంతో తాళి కడుతుంటే...తల వంచుకుని కట్టించుకుంటున్న నాభార్య మొఖంలో ఎంత వెలుగు వెలిగిందో. నాలాంటి అందగాడు తనకు భర్తయ్యాడంటే...ఆమె మనసంతా పండగేగా మరి.
'కాకి ముక్కుకి దొండపండు దొరికాడు, అంటూ మా పెళ్ళైన రోజే ఎవరో అనుకోవడం వినిపించినప్పటి నుంచీ మరీ బురదలో కాలేసానేమో అనిపించింది నామనసుకు. బురదైతే...కడుక్కుని వదిలించుకోవచ్చు. కానీ జీవితాంతం వదిలించుకోలేని వివాహ బంధమైపోయింది నాభార్య. ఏదో యాంత్రికంగా...ఆమెతో సంసార జీవనం సాగిస్తున్నాను గానీ నాలో ఏకోశాన్నా....తృప్తి అంటూ లేదు. తెల్లగా మిసమిసలాడుతూ...చక్కని కనుముక్కు తీరు, పొందికైన ఒంటితీరుతో యేఆడవాళ్లు కనిపించినా...నాలో ఏదో ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ చోటుచేసుకుంటుంది. అలాంటి అందమైన అమ్మాయిని నేను భార్యగా పొందలేకపోయానే అని. జరిగిందంతా...జరిగిపోయింది. చేసేదిలేక... నాభార్యతోనే కాపురం చేస్తున్నా...నాలో ఒక్కసారైనా నా మనసుకు నచ్చిన పరాయి స్త్రీతో ఒక్క రాత్రైనా గడపాలనే కోరిక బలంగా నాటుకుపోయింది. కానీ...ఎలా..? నాకైతే...బజారు మనుషుల దగ్గరకు వెళ్లాలంటేనే భయం. ఎవరికి ఎలాంటి జబ్బులుంటాయో అని. అందుకే...పెళ్లై ఐదేళ్లు దాటిపోతున్నా...నా కోరిక కోరికగానే ఉండిపోయింది. నేను యవ్వనప్రాయంలో వుండగానే అలాంటి అవకాశం, అదృష్టం కలిసి రావాలని ఎప్పటికప్పుడు ఎదురుచూడని రోజు లేదు.
నిజానికి నాభార్య నలుపన్నమాటే గానీ...తనలో అన్ని లక్షణాలూ ఉన్నాయి. పల్లెటూరు పిల్ల కావడం వల్ల...ఇంటిని చక్కబెట్టుకుంటూ... రుచికరమైన వంటలు చేస్తూ..నాకు సమయానికి అవసరమయ్యే అన్ని పనులూ చక్కబెడుతుంది. పడక విషయంలో...భార్యతో దాంపత్య జీవనం యాంత్రికంగా సాగిస్తున్నా...ప్రతిరాత్రీ నాకు నచ్చిన పరాయి స్త్రీని పొందాలనే కోరిక మాత్రం నాలో జ్వలిస్తూనే ఉంది.
పడగ్గదిలో పడుకున్నానే గానీ...మనసంతా రఘురామ్ భార్య మీదే ఉంది... ! ఆమే గనుక నాకు భార్యగా రాసివుంటే జీవితాంతం స్వర్గంలో విహరించేవాడినేమో. ఆమెను చూసినప్పటినుంచీ నాకళ్లలోనే మెదులుతుంది. మనసంతగా ఇష్టపడింది ఆమెను. ఎంతో లావణ్యం సంతరించుకున్న ఆమె...అసలా రఘురామ్ గాడిని ఎలా కట్టుకుందో...? నాకైతే వాడి అదృష్టానికి కుళ్లికుళ్ళి ఏడవాలనుంది. ఎంతో పుణ్యం చేసుకుంటేనే అలాంటి భామలు భార్యలుగా దొరుకుతారేమో...? వాడు చేసుకున్న పుణ్యమేమిటో...నేను చేసిన పాపమేమిటో నాకర్థం కావడంలేదు.
ఓ ఆడదానిమీద మనసు పారేసుకుంటే...అతీయటి వేదన అనుభవించేవాళ్లకే తెలుస్తుందేమో...?
నాభార్య నాపక్కకొచ్చి ఎప్పుడు పడుకుందో కూడా గమనించలేదు ...
ఆమెపై ఆలోచనతో.... కళ్ళు మూసుకున్నానే గానీ...రెప్పల చాటున ఆ అందాలరాశి అందమే దోబూచులాడుతుంది. పచ్చని శరీరఛాయ. నవ్వితే బుగ్గన సొట్టపడుతూ ముద్దొచ్చే ఆకర్షణ, నాగుపాము లాంటి పొడవాటి జడ, నయాగారం లాంటి నడుము...ఎత్తుకు తగ్గ ఒంటితీరుతో బాహ్యంగానే అందాలతో కనువిందు చేస్తుంటే... ఆమె లోపలి అందాలు ఇంకెంతగా కళ్ళు జిగేలుమనిపిస్తాయో...? ఆమెను ఆవిధంగా కూడా చూడాలని పిచ్చి కోరిగ్గా ఉంది. ఆమెను చూసిన మొదటిసారే...నా గుండెకేమయ్యిందో తెలీదు. పదే పదే గుర్తుకొస్తుంది ... తనువంతా తహతహగా ఉంది. హుషారు సినిమాలో మనసునీ తనువునీ ఎక్కడికో తీసుకెళ్లిపోయి తన్మయించే రసవత్తరమైన పాట...కళ్ళ ముందు మెదులుతుంటే...ఆమెను అలాగే గుండెల్లో పొదువుకోవాలనే కాంక్షతో మనసులోనే మౌనంగా ఎన్నిసార్లు పాడుకున్నానో...
'ఉండిపోరాదే గుండె నీదేలే
హత్తుకోరాదే గుండెకే నన్నే'
అంతగా....ఆమెను అల్లుకుపోవాలని. కానీ ఎలా...? ఆమెతో ఆ సౌఖ్యం నాకు దక్కేదెలా...? ఆరాత్రంతా ఆమెతో గడిపిన ఊహలే ఏదో లోకానికి తీసుకెళ్లిపోయాయి. ఇక ఆమెతో ఒక్కసారైనా గడిపే ఛాన్స్ వస్తే....ఈ జన్మ ధన్యమే. నాలో కోరిక బలంగా పెరుగుతుంటే... రఘురామ్ భార్యను ఎలా వల పన్నాలో తెలీడం లేదు. ఆలోచిస్తుంటే...టక్కున గుర్తొచ్చింది....
అన్నట్లు రఘురామ్ సస్పెండ్ అయ్యాడు. ఎంక్వయిరీ కూడా అయిపోయింది. నేనే ఎంక్వయిరీ రిపోర్ట్ సబ్మిట్ చెయ్యాలి. దీనిని నేను ఎందుకు ఉపయోగించుకోకూడదు..? ఆ ఆలోచన రాగానే..నాలో చిన్న చిగురాశ తొడిగింది. ప్రయత్నం చేస్తే ...చూడాలి అతను ఏమంటాడో...? మనసులోకి వచ్చిన ఆగిలిగింతతో పాటూ సందిగ్థత కూడా చోటుచేసుకోవడంతో ఆఆతృత నుంచి ఎంత త్వరగా బయటపడదామా అని ఉంది.
మర్నాడు ఆదివారం కావడంతో...రఘురామ్ కి ఫోన్ చేసి..."నీతో చిన్న పని ఉంది...బయట ఎక్కడైనా కలుసుకుందామా" అని అడిగాను. బ్యాంక్ అధికారిని కావడంతో... రమ్మన్నదే తడవుగా రావడానికి వినయంగా రెడి అయ్యాడు. నా ప్లాను సఫలీకృతమయ్యేలా రఘురామ్ ని మంచిమాటలతో బుట్టలో పడేయాలి అనుకుంటూ...ఇన్ని గంటలకు ఫలానా రెస్టారెంట్ కి రమ్మని చెప్పాను.
నేను చెప్పినట్టుగానే....ఉదయం పదయ్యేసరికి తాజ్ రెస్టారెంట్ దగ్గర నాకోసం నిరీక్షిస్తున్నాడు. అతన్ని అలా చూడగానే....నేను అడగబోయే కోరికకు అతనెలా రియాక్ట్ అవుతాడోననే గుబులు నన్ను కొద్దిగా ఆవరించకపోలేదు.
అయినా...నేను స్థిరంగా ఉండాలనే గట్టి తలంతో.... నా కోరికను సడలించుకోదల్చుకోలేదు.
రెండు కాఫీ ఆర్డర్ ఇచ్చాను. సర్వర్ తెచ్చిన కాఫీ కప్పును అతని వైపు తోస్తూ...ఆఫర్ చేసాను. నా ఎదుట అలా కూర్చోవడం అతనికి ఇబ్బందిగా ఉన్నట్టుంది. "పర్లేదులే... నాతో ఇక్కడ కాస్త ఫ్రీగా ఉండచ్చు" అంటూ...భుజం తట్టాను.
ఉద్యోగరీత్యా...ఆవిషయం ఈవిషయం మాట్లాడుతూ... తనని త్వరగా సస్పెన్షన్ నుంచి తప్పించే పూచీ నాదని చెప్పాను.
నావైపు ఎంతో కృతజ్ఞతగా చూసాడు. "అయితే...నీవొక మాట ఇవ్వాలి నాకు" అంటూనే... విచక్షణ కోల్పోయి ఏ భర్తనీ అడగకూడని కోరికను అడిగేసాను.
రఘురామ్ వీస్తుపోయాడు...!
ఆ మాటడిగినందుకు వెంటనే నా చెంప చెళ్లు మనిపించనందుకు నేనూ వీస్తుపోయాను.
నాపాడు కోరికకు వెర్రిమొఖం వేసాడు. అతన్నలా చూశాకా ...నాలో పూర్తి ధైర్యం వచ్చింది. నాకు తెలుసు...నన్ను చంపేస్తాననో...నరికేస్తాననో...ఇలాంటి మాటలు నాపై ప్రయోగించలేడని. నా అవసరం రఘురామ్ కి ఎంతైనా ఉంది. మరేమనుకున్నాడో...ఏమో..?
"నాకు రెండు రోజులు టైం ఇవ్వండి. నా భార్యను ఒప్పించాలి కదా..." గొంతు పెగుల్చుకుని...ఎలాగైతే సగం మాట ఇచ్చాడు ఆరోజుకి.
"సరే రఘురామ్...రెండు రోజులు కాకపోతే వారం రోజులు తీసుకో. వచ్చే ఆదివారం నాటికైనా నాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలి. అప్పుడే...నువ్వు సస్పెన్షన్ నుంచి రీజాయినింగ్ కి అయ్యే ఏర్పాట్లు త్వరగా చేయగలను " అంటూ కండీషన్ పెట్టాను.
సమాధానంగా తల ఊపీవూపనట్టు అక్కడ నుంచి కదిలెళ్లిపోయాడు.
అలా వెళ్తున్న రఘురామ్ ని చూస్తుంటే....మనసంతా ఆనందం అల్లుకుపోయింది. ఎందుకో ఇన్నాళ్లకైనా నా వాంఛ నెరవేరబోతుంది అనే గట్టి నమ్మకం కుదిరింది.
నేనాశించినట్టే....
ఆదివారం రేపనగా...రఘురామ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడు. నాలో ఏదో తెలియని ఆనందం. అయితే ...తన భార్య చిన్న షరతు పెట్టిందంట. తాను ఆ పనికి ఒప్పుకోవాలంటే... ఆ ఇంటి గడప దాటి కాలు బయటపెట్టదట. వారింటికే వచ్చి గుట్టుగా వ్యవహారం చక్కబెట్టుకోమని చెప్పిందంట. ఆ మాట వింటూనే...నా ఊహలకు రెక్కలొచ్చి స్వర్గం చుట్టివచ్చినట్టు ఫీలయ్యాను. నన్ను నేను గిల్లుకుని చూసుకున్నాను. ఇంత చటుక్కున పనవుతుందని నేననుకోలేదు. లోపల ఉబికివస్తున్న ఆత్రాన్ని ఆపుకుంటూ..."సరే లేవోయ్ మీ ఆవిడ నాకోరిక తీరుస్తాననడమే మహా భాగ్యం. మీ ఆవిడ చెప్పినట్టుగా మీఇంటికే రేపొచ్చేస్తాను" అనేసాను.
ఆమె నాసొంతం కావడానికి ఆభార్యాభర్తల మధ్య ఏం పడ్డారో నాకనవసరం అనిపించింది.
ఆరోజు రాత్రంతా...నాకు నిద్ర పడితే ఒట్టు. ఆ అందాల రాశి, అపురూప సౌందర్యవతిని అనుభవించబోతానన్న నిజాన్ని జీర్ణించుకోలేకపోతున్నాను. తనివితీరా ఆమె అందాల్ని ఆస్వాదించాలి. ఒక్క రేయితో...జీవితాంతం మర్చిపోలేని తీయటి మధురానుభూతుల్ని మిగుల్చుకోవాలి. నాకున్న కోర్కెల చిట్టా విప్పాలి. మళ్లీ ఇలాంటి అవకాశం వస్తుందో లేదో...? వచ్చిన ఈ అవకాశం నన్నెంతో రాసానుభూతుల్ని కలిగిస్తుంటే...తన్మయత్వంతో ...ఆమెనే తలచుకుంటూ మంచంపై పొర్లాను.
మర్నాడు సాయంత్రం....
శుభ్రంగా స్నానం చేసి...ఇస్త్రీ చేసిన లాల్చీ పైజామా వేసుకుని...పెర్ఫ్యూమ్ జల్లుకుని...ఎంతో హుషారుగా బయటకు బయలుదేరుతుంటే...నావైపు అదోలా చూసిందే గానీ...ఎక్కడికండీ అని అడగలేక నోర్మూసుకుంది నాభార్య.
సరాసరి రఘురామ్ ఇంటికెళ్లి తలుపు కొట్టాను. తలుపు తీస్తూ..."రండి సార్...మీకోసమే ఎదురుచూస్తున్నా" అంటూ లోనికాహ్వానించాడు. నాకు మాటిచ్చినందుకేమో...అతనిలో ఎలాంటి అభ్యంతరమూ కనిపించలేదు నాకు.
పరాయి మగాడి భార్య కోసం వచ్చినందుకు ఒక్క క్షణం నాకే సిగ్గనిపించింది. తటపటాయిస్తూనే లోనికెళ్లి కూర్చున్నాను. ఇప్పుడే వస్తానంటూ...లోపలికి వెళ్లి భార్యను వెంటపెట్టుకుని వచ్చాడు.
నన్ను చూపిస్తూ.... "ఈయన మా మేనేజర్ దివాకర్ గారు" అంటూ పరిచయం చేసాడు భార్యకు . అలాగే ఆమెను కూడా నాకు పరిచయం చేస్తూ..."నా భార్య రాశి " అన్నాడు.
"నమస్కారమండీ...." అంటూ...రెండు చేతులూ జోడించిన రాశిని చూసేసరికి.....ఆ చేతిని అందుకుంటూ...అమాంతం ఒడిలోకి లాక్కోవాలనిపించింది. ఎదురుగా ఆమె భర్త ఉండటంతో...నిగ్రహించుకుని... అప్రయత్నంగా నేనూ చేతులు జోడించాను. ఆ అందాలరాశి వయసూ సొగసే కాదు...మాట కూడా అమృతంలా ఉంది నాచెవులకి. రఘురామ్ తన భార్యకి ఏదో సైగ చేసి..."సార్ నేను బయటకు వెళ్తాను. ఈలోపు మీరొచ్చిన పని కానిచ్చుకోండి" అంటూ హడావిడిగా బయటకు వెళ్ళిపోయాడు.
అప్పటివరకూ ఎన్నో ఊహల్లో ఉన్న నేను...వచ్చిన ఆ అవకాశాన్ని దుర్వినియోగం చేయకూడదనుకుంటూ ఎలా మొదలుపెట్టాలా అని ఆలోచిస్తున్నాను. రాశి నావైపు చూసి కైపుగా నవ్వింది...నన్ను మరింత రెచ్చగొట్టేలా. "ఒక్క నిమిషం" అంటూ లోనికెళ్లింది. ఆ మరునిమిషమే..పళ్ళు, స్వీట్స్,జ్యూస్ ఒక ప్లేట్ లో పెట్టి తీసుకొచ్చి తీసుకొండని చెప్పి నా ఎదురుగా కూర్చుంది. ఆమెను అలా చూస్తుంటే... ఆమె అందాన్ని జుర్రుకుని తాగాలనిపిస్తుంది. జ్యూస్ గ్లాసు నందుకుని...మీరూ తీసుకొండని గ్లాసు నందిస్తూ...తాకీ తాకనట్టుగా ఆమె చేతిని తాకాను. ఆ కొద్ధి స్పర్శకే నాలో నరాలు జివ్వుమన్నాయి. ఆమె జ్యూస్ తాగుతుంటే...ఆ ఎర్రటి పెదాలు మరింత మత్తెక్కిస్తున్నాయి. కొద్దికొద్దిగా సిప్ చేస్తూ నన్ను చూసి నవ్వింది. ఆ నవ్వు చాలు ఇష్టపూర్వకంగానే నాకు దగ్గరవ్వడానికి ప్రిపేరై వుందని . నాలో ఎక్కడలేని తెగువా వచ్చేసింది. ఆమె అందాన్ని పొగుడుతూ ఆమె పక్కకి చేరాను. ప్రతి మాటకూ నవ్వుతూ కిలకిలమంటుంటే. ..బుగ్గన పడుతున్న సొట్టల్ని చటుక్కున ముద్దు పెట్టుకోవాలనిపిస్తుంది. ఆమె అందం ఊరిస్తుంటే... కోరికతో దగ్గరగా జరిగి ...ఆమె తొడపై చేయివేశాను. అప్పుడే "అంత తొందరెందుకు" అంటూ...సుతారంగా నా చేయిని పక్కకు తీసి...పైకి లేస్తుంటే.... పట్టులాంటి ఆమె చేతిని మరింత సున్నితంగా పట్టుకున్నాను. అబ్బా...వుండండి అంటూనే నా చేయి విడిపించుకుని... ఆమె బెడ్రూంలోకి దారితీసింది. రెండు నిమిషాలు ఆగి చూసి...ఇక ఆగలేక ఆమె వెళ్లిన పడక గదిలోకి నేనూ అడుగు పెట్టాను.
తాను బాత్రూమ్ లోవున్నట్టుంది. నీళ్ల శబ్దం వినిపిస్తుంటే... నాలో కోరిక మరింతగా రాజుకుంటుంది. ఇంతలో సెల్ ఫోన్ మోగడంతో తుళ్ళిపడ్డాను. "కొద్దిగా ఫొన్ చూస్తారా...? మా వారు వదిలేసినట్టున్నారు..." బాత్రూమ్ తలుపు కొద్దిగా వారగా తీసి మొహం బయటకు పెట్టి గోముగా అడిగింది. మొహం కడుక్కుంటున్నట్లు ఉంది...సబ్బు నురుగతో ఉన్న ఆమె మొహం మబ్బుల్లోంచి తొంగిచూస్తున్న చందమామలా ఉంది. అప్పటికే నా నరాలు జివ్వున లాగేస్తున్నాయి. ఇక క్షణమైనా ఆగకూడదనుకుంటూ వెంటనే సెల్ ఫోన్ అందుకున్నాను.
ఫోను స్క్రీన్ పై డాక్టర్ శేఖర్ అనే పేరు చూసి తటపటాయిస్తూ కాల్ రిసీవ్ చేసుకున్నాను.
అవతలి నుంచి ...ఒరేయ్ రఘురామ్ అంటూ...డాక్టర్ మాటలు....
పూర్తిగా విన్నాకా...నాలో ఏదో అశక్తత. అంతటి సుందరాంగీ విషవలయంలో చిక్కుకుందనే వేధన. అదంతా నమ్మబుద్ది కాలేదు. కానీ...ఆమాటలు ఓ డాక్టర్ నోటి నుంచి నేరుగా వినిపించిన ఓ భయంకరమైన సత్యం. మనసంతా ఒకటే అలజడి. అక్కడిక వుండేం ప్రయోజనమూ లేదనిపించించింది.
బాత్రూమ్ వైపు చూసాను. నీళ్ల శబ్దం వినిపిస్తూనే ఉంది. నెమ్మదిగా అడుగులో అడుగేసుకుంటూ... అక్కడనుంచి బయటపడ్డాను. కార్ స్టార్ట్ చేసాను. ఎలా డ్రైవ్ చేశానో...ఎలా ఇంటికొచ్చి మంచం మీద పడ్డానో నాకే తెలీదు. మైండ్ బ్లాకయ్యింది.
* * * *
తెల్లారింది....!
రాత్రంతా నిద్రలేదేమో...? తెల్లవారుఝామున నిద్రపట్టింది. బద్ధకంగా లేచి పెరట్లోకి వెళ్ళాను. ఏదో కూనిరాగం తీసుకుంటూ అంట్లు తోముతుంది నా భార్య. ఎప్పుడూ లేంది ఆరాగం కూడా తీయగానే వినిపించింది నాకెందుకో. ఒక చెవి అటేసి వింటున్న నన్ను చూసి... "లేచారా...ఇప్పుడే వెళ్లి కాఫీ తెస్తాను. ఈ పనిమనిషి చెప్పాపెట్టకుండా ఈరోజు మానేసింది. మీరింకా లేవలేదని ఈపని పెట్టుకున్నా" అంటూ కంగారు పడింది.
"పర్లేదు...నువ్వు నీపని కానీయు నేనింకా పళ్ళు తోముకోవాలి... " అని చెప్పి బ్రష్ అందుకుంటూ... మరోసారి నాభార్యను చూసాను. నీరెండకి మొహం మీద పడుతున్న చమటను తుడుచుకుంటూ...గబగబా గిన్నెలు కడిగేస్తుంది. వంగుని ఉన్న తన నడుమోంపుని చూసి ఎంతో పొందికగా వుందనిపించి మనసారా.....తనివితీరా చూసాను. నల్లగా ఉందని ఏనాడూ అంత పట్టింపుగా నాభార్యను చూసెరుగను. ఏదో ముక్తసరిగా చీకట్లో ఆమెతో సంసారం చేయడం తప్పించి. ఎప్పుడూ ఏదో పనిచేసుకుంటూనే...చిన్న కూనిరాగం తీసుకుంటూ ..భర్తే సర్వస్వం అనుకునే ఆడవాళ్ళలో నాభార్య కూడా సగటు మనిషి. అందునేమో...ఆరోగ్యంగా మిసమిసలాడుతూ ఉంది. ఒద్దికగా, పొదుపుగా సంసారం చేసుకుంటూ...తన మాంగల్య బలానికి పూజలూ పునస్కారాలు చేసుకోవడమే గానీ....నన్నో మాట అనడం గానీ...సాధించడం గానీ ఎప్పుడూ విని ఎరుగను. తన సాన్నిహిత్యాన్ని, ఇష్టాన్ని నిర్లక్ష్యం చేసానిన్నాళ్లు. అందం అనేది మానసికమైనది గానీ...బాహ్యమైనది కాదని విన్నాను...చదివాను. అయినా ఇన్నాళ్లూ నన్ను మార్చలేకపోయాయి. సమయానికి డాక్టర్ నుంచి ఆ ఫోను వచ్చింది కాబట్టి సరిపోయింది. లేదంటే... క్షణికావేశంతో...నిన్న ఆమెతో కలిసిపోయివుంటే...నా గతి ఎలా మారేదో...? బహుశా నాభార్య చేసుకున్న పుణ్యఫలమే నన్ను అలా కాపాడి ఉంటుంది.
కాఫీ అందిస్తున్న నాభార్య కళ్ళలోకి మొదటిసారిగా అనురాగంతో చూస్తూ అనుకున్నాను...ఇంట్లో కమలాన్ని పెట్టుకుని బురదలో కాలేయబోయానని. రాశితో గడుపుదామనుకున్న ముచ్చట్లన్నీ...నాభార్యని చూస్తుంటే... తీర్చుకోవాలనిపిస్తుందిప్పుడు. నామనసుకు పట్టిన చీడంతా వదిలిపోయినట్టు... అమావాస్య కాస్తా పున్నమి వెన్నెల్లా మారిపోయినట్టు...ఏదో అనుభూతి నాలో.
ఆరాత్రి...నాలోని కొత్త కోరికల్ని పసిగట్టి...తనలో స్వర్గాన్ని చూపించింది నాభార్య. ఆరోజు మొదలు ప్రతిరేయిలోనూ...ఏదో కొత్తదనం పుడుతూనే వుంది.
మళ్లీ కొన్నాళ్ళకు ...కొలీగ్ కొడుకు పుట్టినరోజు ఫంక్షన్లో....రఘురామ్ తో పాటూ అతని భార్య రాశి కూడా కనిపించింది. రోజూ కనిపించే రఘురామ్ ఎదుటే బుర్ర ఎత్తుకోలేక చస్తుంటే... అతని భార్య కూడా ఎదురవ్వడంతో మొహం చాటేశాను.
ఆమె తలంపుకొస్తే ఇప్పుడెలా ఉందో అనుకునేవాడిని. కానీ మందులు వాడుతున్నట్టుంది. చూడ్డానికి బానే ఉందనిపించింది. ఆమెలో ఎలాంటి మార్పూ లేదు. ఈసారి ఆమెను చూసినా గానీ...ఎందుకో నాలో ఎలాంటి చలనమూ, వాంఛ కనిపించలేదు. నాకే ఏదో తప్పు చేసిన ఫీలింగ్. వారిముందు నుంచి తప్పించుకుని వెళ్లిపోదామనుకుంటుండగా... వారిద్దరూ నాదగ్గరకు రానే వచ్చారు.
"బాగున్నారా..."? అడిగింది రాశి.
" హ..." అంటూ..ముక్తసరిగా సమాధానమిచ్చాను. ఎందుకో నాతప్పును ఒప్పేసుకుని ఆ అపరాధభావం నుంచి బయటపడదామనిపించింది. అలా అనిపించగానే... "మీ ఇద్దరూ నన్ను క్షమించాలి. ఆరోజు మీ ఇంటికి నేనొచ్చి ఉండకూడదు. అలా మిమ్మల్ని ఆశించనూ కూడదు. ..." తల దించుకుని నాతప్పును ఒప్పుకున్నాను.
ఆ భార్యా భర్తలిద్దరూ నన్ను చూసి ...ముసిముసిగా నవ్వుకున్నారు. వారలా ఎందుకు నవ్వుకున్నారో నాకర్థం కాలేదు గానీ...వారి కళ్ళలోకి సూటిగా చూడలేకపోయాను.
"సర్...మీరిక ఆవిషయం గురించి మర్చిపోండి." అంటూ...అక్కడనుంచి కదిలివెళ్లిపోయారు.
అలా వెళ్తున్న వారివైపు ప్రాశ్చాత్తాపంతో చూసాను. వారి దృష్టిలో నేనెంతగా దిగజారిపోయి వుంటానో...? నాభార్యతో మాత్రమే సుఖానుభూతిని పొందుతున్నానంటే వారు నమ్మరేమో...? నేనెందుకలా....పరాయివాడి భార్య కోసం దిగజారాలని చూసానో...? నా పాడు బుద్ధికి నాకే అసహ్యం వేసింది.
*** *** ***
పార్టీ నుంచి ఇంటికెళ్లడానికని బయల్దేరాను. కారు పార్కింగ్ దగ్గర రఘురామ్, అతని భార్య రాశి
పగలబడి నవ్వుకుంటున్నారు.
వారికి కనబడకుండా కారు చాటున నిల్చొని వారి మాటలు వింటున్నాను.
"మనల్ని మనం రక్షించుకోడానికి మనం ఆడిన నాటకం తో పాపం...మా మేనేజర్లో చాలా పరివర్తన వచ్చింది. ఇలాగైనా...అతనిలో మార్పుతీసుకొచ్చి...మంచి పని చేసాము." అంటూ నవ్వుతూనే చెప్తున్నాడు రఘురామ్.
" ఆరోజు ఫోన్లో మీరు మాట్లాడిన మాటల్ని నిజంగా డాక్టర్ చెప్పినవే అనుకున్నాడు పాపం...అంతేకాదు పార్టీలో నిజంగా నేను ఎయిడ్స్ రోగినేనని నావైపు సానుభూతిగా చూస్తున్నాడు మీ మేనేజర్..."అంటూ కిలకిలా నవ్వుతోంది రాశి.
వారిమాటలు విన్నాకా...నా కళ్లు బైర్లు కమ్మాయి. ఆరోజు జరిగింది గుర్తొచ్చింది.
ఆరోజు...అప్పుడు ఏం జరిగిందంటే....
రాశి బాత్రూం లోంచి ఎప్పుడెప్పుడు వస్తుందాని ఎదురుచూస్తూ...ఆమె కోసం పరితపిస్తున్న సమయంలో రఘురాం సెల్ మొగడంతో .. బాత్రూమ్ లోంచే మొఖం బయటకు పెట్టి...ఆ కాల్ లిఫ్ట్ చేయమని రాశి గోముగా అడిగిన తీరులో ఏదో కుట్ర వుందనుకోలేదు.
రాశి అందుకోమని చెప్పిన ఆ సెల్లో ...డాక్టర్ శేఖర్ పేరుతో...రఘురామ్ మొబైల్ నెంబర్ ఫీడ్ చేసి ఉంచడంతో...నేను విన్న మాటలు నిజంగా డాక్టర్ గారివే అని నమ్మాను..
"ఒరేయ్ రఘురామ్...నేను శేఖర్ని రా. నా అనుమానమే నిజమయ్యింది. నీ భార్యకు ఈమధ్య ఒంట్లో నలతగా వుంటుందంటూ నా హాస్పిటల్ కి వచ్చావు కదా...ఆమెకు అన్ని రక్తపరీక్షలు చేయించాను. రిపోర్ట్స్ లో హెచ్ఐవీ పాజిటివ్ వచ్చింది. నువ్వేం కంగారు పడకు. మంచి మందులు ఉన్నాయి... ఇప్పిద్దాం . ఆమె కోలుకుని బయటపడేలా చేస్తాను...నవ్వేం దిగులు చెందకు..." అంటూ...చెప్పిన ఆ మాటలు డాక్టర్ వి కాదన్నమాట... రఘురామే అలా మాట్లాడన్నమాట...
వాస్తవం తెలిసేక నా కాళ్ళ కింద భూమి కంపించింది.
ఆరోజు హెచ్ఐవీ అనే పదం వినగానే నా గుండెల్లో బాంబు పడ్డట్టయ్యింది. కళ్ళు బైర్లు కమ్ముతున్నట్టయ్యింది. వెంటనే ఫోనక్కడ పడేసి... పిల్లిలా జారుకున్నందుకు ఈరోజు వీళ్లిలా హేళనగా నవ్వుకుంటున్నారన్నమాట...
నా మొహం జేవురించింది.
ఈ పరాభవం చాలు...జీవితాంతం ములుకులా హృదయాన్ని గుచ్చుతూనే వుండటానికి. నాలో ఉన్న కామత్వం వల్లే సభ్యతను మరిచి పరాయివాడి భార్య పొందు కోరాను. ఛీఛీ...ఆరోజు నేను చేసిన పనికి నన్ను నేను క్షమించుకోలేక పోతున్నాను.
కారుని విసురుగా డ్రైవ్ చేయసాగాను. ఆలోచిస్తున్నకొలదీ... ఆ పరిస్థితుల్లో కాముకుడైన నానుంచి వాళ్లని వాళ్లు కాపాడుకోవటానికి మంచి ఉపాయంతో బయటపడి మంచిపని చేశారు. లేదంటే ఆకుటుంబానికే కాకుండా నాభార్యకు కూడా ద్రోహం చేసేవాడినే.
ఈ కారణంగా అయినా నా భార్యకు దగ్గరవటం కూడా జరిగినందుకు అన్ని విధాలా నాకథ సుఖాంతమైందనిపించింది.
మౌనగీతాన్ని కూడా మూగబార్చేసి....నా భార్యలోనే స్వర్గ సౌఖ్యాలూ చూస్తున్నానంటే ... అందుకు వాళ్లే కారణం కదా. అయినా పరాయి ఆడదాన్ని ఆశించటం...అందుకు ఆమె భర్తనే మధ్యవర్తిగా ఉపయోగించటం...ఎంత దారుణం...? ఇలా ఎక్కడైనా ఉంటుందా...? నా ప్రవర్తన నాకే సిగ్గుచేటనిపిస్తూంది...
కారుని నిదానంగా...సాఫీగా డ్రైవ్ చేయసాగేను. జీవితపు రహదారి లో మరెప్పుడూ గతి తప్పకూడదని...!!*
****** ****** *******
(సమాప్తం)

